తెలుగుదేశం పార్టీ కేటాయించిన 24 నియోజకవర్గాల్లో ఎక్కడైనా కనీసం ఒక్క చోట అయినా ఆ పార్టీ వాళ్లు జనసేనకు సపోర్ట్ చేస్తారా? అనేది ఆసక్తిదాయకంగా మారింది! కనీసం ఒక్క చోట అంటే ఒక్క చోట అయినా.. తెలుగుదేశం క్యాడర్ నుంచి, తెలుగుదేశం ఓటర్ నుంచి జనసేనకు పూర్తి మద్దతు లభించడం ప్రశ్నగానే మిగులుతోంది!
పేరుకు 24 సీట్లు అని ప్రకటించినా..ఇప్పటి వరకూ ఐదు చోట్ల అభ్యర్థులను అనౌన్స్ చేసుకోగలిగింది జనసేన. మిగతా చోట్ల పరిస్థితిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఆ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం.. అనే ఊహాగానాలున్నాయి. అలాంటి చోట తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. జనసేనకు కేటాయిస్తే సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. పలు చోట్ల ర్యాలీలు, నిరసనలు కూడా జరుగుతున్నాయి. ఆ నియోజకవర్గాల్లోని టీడీపీ ఇన్ చార్జిలైతే.. తొందర వద్దని.. నామినేషన్ల ఘట్టం ఆఖరి నాటికి ఎవరు పోటీలో ఉంటారో చూద్దాం అంటూ నింపాదిగా మాట్లాడుతున్నారు! అంటే.. జనసేనకు కేటాయించినా తెలుగుదేశం బీఫారం సంపాదించగలమనే ధీమా వారిలో కనిపిస్తోంది.
పలు చోట్ల తెలుగు తమ్ముళ్ల పాట ఏమిటంటే.. తమ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించినట్టుగా అయితే అక్కడ నుంచి పవన్ కల్యాణే పోటీ చేయాలని, ఆయన కాకుండా వేరే ఎవరు పోటీ చేసినా సహకరించేది లేదనే పాట అందుకుంటున్నారు! పవన్ కల్యాణ్ పోటీ చేస్తే ఓకేనట, వేరే ఎవరు చేసినా వీల్లేదట!
క్యాడర్ సహకారం, ఇన్ చార్జిల సహకారం అనేది జనసేనకు తెలుగుదేశం నుంచి లభించే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. జనసేన 24 చోట్ల పోటీ చేసినా.. మెజారిటీ నియోజకవర్గాల్లో రెబెల్ అభ్యర్థులు బెల్స్ మోగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వారిలో ఎంతమందికి చంద్రబాబు ఆఖరి నిమిషంలో బీఫారం ఇస్తారనేది ప్రస్తుతానికి శేషప్రశ్న! చంద్రబాబు రాజకీయంలో ఇలాంటివి కొత్త కాదు. కాబట్టి.. పలు చోట్ల జనసేన, బీజేపీలకు కేటాయించినా.. టీడీపీ అధికారిక అభ్యర్థులే పోటీలో ఉండటంలో వింత లేదు!
ఇక తెలుగుదేశం సంప్రదాయ ఓటరు జనసేన గుర్తు వైపు ఎంత ఆసక్తి చూపిస్తాడనేది కీలకమైన ప్రశ్న! రాయలసీమలోని ప్రాంతాల్లో అయితే.. టీడీపీ సంప్రదాయ బీసీ ఓటు బ్యాంకు, లేదా కమ్మ ఓటర్ జనసేన అంటే చాలా చిన్న చూపు ఉంది. కమ్మ వాళ్లు అయినా వ్యూహాత్మకం అనుకుని ఓటేస్తారేమో కానీ, బీసీ ఓటు బ్యాంకు జనసేన వైపు చూసే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
పొత్తు ఉన్నా.. సంప్రదాయ ఓటు బ్యాంకు కొత్త పార్టీకి ఓటేయడం తేలిక కాదు! జనసేన వీరాభిమాన ఓటర్ టీడీపీ మద్దతు పలుకుతాడేమో కానీ, టీడీపీ ట్రెడిషినల్ క్యాడర్, ఓటర్ మాత్రం.. జనసేన వైపు మొగ్గేలా లేదు క్షేత్ర స్థాయి పరిస్థితి!