తెలుగుదేశం- బీజేపీల పొత్తు ఖరారు నేపథ్యంలో.. బీజేపీలో చంద్రబాబు మనుషులు ఖుషీ అవుతున్నారు. తమకు టికెట్ ఖరారు అయినట్టే అని వారు సోషల్ మీడియాలో ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. తమ అవసరం మేరకో, చంద్రబాబు అవసరం మేరకో బీజేపీలో చేరిన వారు ఈ పొత్తుతో తాము పోటీకి రెడీ అంటున్నారు! ఇలాంటి వారిలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఒకరు. బడా కాంట్రాక్టరు అయిన సూరి తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజుల్లోనే కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎప్పుడూ పచ్చకండువా వేసుకునే తిరిగారు!
అయితే తెలుగుదేశం పార్టీకి ధర్మవరంలో దిక్కు లేకుండా పోవడంతో పక్క నియోజకవర్గానికి చెందిన పరిటాల శ్రీరామ్ ను ఇన్ చార్జిగా ప్రకటించారు. లాభమోనష్టమో పరిటాల శ్రీరామ్ అయితే ధర్మవరం ఇన్ చార్జిగా వ్యవహరించారు. ఆయన తల్లి రాప్తాడు నియోజకవర్గం ఇన్ చార్జిగా శ్రీరామ్ ధర్మవరం ఇన్ చార్జిగా వ్యవహరించారు. అయితే పార్టీ కష్టకాలంలో ఉండగా.. క్యాడర్ కు చెయ్యిచ్చి, ఎవరినీ పట్టించుకోకుండా తన స్వార్థం చూసుకున్న సూరి ఇప్పుడు బీజేపీ ముసుగులో ధర్మవరం అభ్యర్థి అవుతున్నారు!
పొత్తు ధర్మం మాటతో ఇప్పుడు పరిటాల శ్రీరామ్ కు చంద్రబాబు షాక్ ఇచ్చినట్టే! మరో విశేషం ఏమిటంటే.. రాప్తాడు నుంచి పరిటాల సునీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు ఏతావాతా శ్రీరామ్ కు ఎక్కడ్నుంచి కూడా అవకాశం లేనట్టే అవుతోంది! యువకుడు, ఉత్సాహవంతుడిగా గత ఎన్నికల్లో తొలి సారి పోటీ చేసి ఓడిన శ్రీరామ్ కు ఈ ఎన్నికల్లో టికెట్ లేనట్టే అని స్పష్టం అవుతోంది.
కష్టకాలంలో పార్టీలో నిలబడిన వారి కన్నా.. చంద్రబాబుకు మార్కు అవకాశవాద పొత్తుల్లో అవకాశవాదులకే అవకాశం దక్కుతుందని ధర్మవరం నియోజకవర్గం నీతిని చెబుతోంది. మరి ఐదేళ్లుగా నియోజకవర్గానికి మొహం చాటేసి, ఇప్పుడు హడావుడి చేస్తున్న సూరి అంటేనే టీడీపీ క్యాడర్ ఈసడించుకుంటోంది.
సామాన్య ప్రజలు కూడా ఆయననో అవకాశవాదిగా చూస్తున్నారు తప్ప, బీజేపీ రంగేసుకుని పోటీ చేయగానే.. ఎగేసుకు గెలిపించే పరిస్థితి కూడా ఏమీ లేదు! మరి ఇప్పుడు పరిటాల శ్రీరామ్ కు అసలు ఏ నియోజకవర్గం లేకుండా మిగిలిపోవడమా లేక తల్లి చేత నిరాసక్తత ప్రకటన చేయించి రాప్తాడు లో పోటీ చేయడమో ఛాయిస్ లాగుంది!