ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కమలాపురం నియోజక వర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా నరసింహారెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. వైసీపీలో చేరడానికి సమాయత్తం అవుతున్న టీడీపీ మాజీ నాయకుడు సాయినాథ్‌శర్మపై పుత్తా అనుచరులు దాడికి తెగబడ్డారు.
ఈ ఘటనలో సాయినాథ్‌శర్మతో పాటు ఆయన కుమారుడు, అనుచరులకు గాయాలయ్యాయి. కమలాపురం నియోజకవర్గంలో చాలా కాలంగా పుత్తా నరసింహారెడ్డి, సాయినాథ్‌శర్మ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సాయినాథ్‌శర్మ కూడా టీడీపీలోనే వుండేవారు. నాలుగైదు గ్రామాల్లో రాజకీయంగా ఆయన ప్రభావం చూపుతారు. కమలాపురం ఎమ్మెల్యే టికెట్‌ను సాయినాథ్‌శర్మ ఆశించారు.
దీంతో తనకు అడ్డొస్తున్నాడని పుత్తా నరసింహారెడ్డి ఆగ్రహించారు. సాయినాథ్‌శర్మ ప్రత్యేకంగా టీడీపీ కార్యకలాపాలు నిర్వహిస్తుండడాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి పుత్తా తీసుకెళ్లారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే కారణంతో సాయినాథ్‌శర్మపై టీడీపీ అధిష్టానం సస్పెన్స్ వేటు వేసింది. దీంతో వైసీపీలో చేరేందుకు సాయినాథ్ శర్మ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో కమలాపురం నియోజకవర్గంలోని పెద్దచెప్పలిలో సాయినాథ్‌శర్మ వర్గీయులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణను సాయి ప్రకటించాల్సి వుంది. ఆత్మీయ సమ్మేళనం నిర్వాహకులపై పుత్తా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. సాయినాథ్‌శర్మ బాధితులను పరామర్శించడానికి అక్కడికి వెళుతుండగా, పుత్తా అనుచరులు దారికాచి రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు.
ఈ దాడిలో సాయినాథ్‌శర్మతో పాటు ఆయన కుమారుడు, ఇతర అనుచరులకు గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. బాధితులను కడప రుయా ఆస్పత్రికి తరలించారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మెతక వైఖరి వల్లే ప్రత్యర్థులు రెచ్చిపోతున్నారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన అనుచరుల కోసం గట్టిగా నిలబడకపోతే పుత్తా ప్రత్యర్థులను భయాందోళనకు గురి చేస్తారనే మాట వినిపిస్తోంది.