ధర్మాన మాటల వెనక మర్మమేంటో?

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు సభలలో మీడియా ముందు చేసే వ్యాఖ్యలు కొన్ని సార్లు వివాదం అవుతూ ఉంటాయి. తాజాగా ఆయన చేసిన అలాంటి వ్యాఖ్యలే ఇపుడు రాజకీయంగా డిస్కషన్…

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు సభలలో మీడియా ముందు చేసే వ్యాఖ్యలు కొన్ని సార్లు వివాదం అవుతూ ఉంటాయి. తాజాగా ఆయన చేసిన అలాంటి వ్యాఖ్యలే ఇపుడు రాజకీయంగా డిస్కషన్ కి తావిస్తున్నాయి. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో నిర్వహించిన వైఎస్ చేయూత నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మీద మగాళ్ళకు కోపం అంటూ వ్యాఖ్యలు చేశారు.

తాము ప్రతీ పధకానికి ఆడవారి పేరున నిధులు ఇస్తున్నామని వారి పేరునే ఖాతా తెరచి నేరుగా నగదు బదిలీ చేస్తున్నామని ధర్మాన అన్నారు. దాంతో ప్రతీ అవసరానికి తమ ఆడవారిని డబ్బులు అడగాల్సి రావడంతోనే మగాళ్ళు కొంత తన ప్రభుత్వం మీద అసంతృప్తి గా ఉన్నారని ధర్మాన చెబుతున్నారు.

ఇంటి మగవారు టీడీపీకి ఓటు వేయమన్నా వేయమంటారు. కానీ ప్రతీ పధకం అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఆడవాళ్ళు వైసీపీకే ఓటేయాలి సుమా అని ధర్మాన జాగ్రత్తలు చెప్పారు. సుతిమెత్తగా హెచ్చరించారు. వైసీపీకి గత ఎన్నికల్లో అధికారం ఇస్తే ప్రభుత్వ పధకాలు అన్నీ తాము వారికి అందించామని ఈసారి కూడా తమ పార్టీని గెలిపించాలని ఆయన మహిళలకు విజ్ఞప్తి చేశారు. ధర్మాన వ్యాఖ్యలు చూస్తే జనాభాలో సగం మంది ఉన్న మగవారు తమకు వ్యతిరేకం అని తనకు తానుగా చెపుకున్నట్లుగా ఉందని అంటున్నారు.

మహిళా ఓటు బ్యాంక్ మీద గురి పెట్టి ధర్మాన వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేసినా మగవారి ఓట్లు అవసరం లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పెద్దాయనగా జిల్లాలో పేరున్న ధర్మాన ధర్మంగా మాట్లాడాను అనుకున్నా రాజకీయంగా అది సరిపోతుందా అని అంటున్నారు అంతా.