సుడిలో వట్రసుడి అంటే ఇదే! జనసేనాని పవన్ కల్యాణ్ కు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా.. పవన్ కల్యాణ్ ఆ ఆఫర్ ను స్వీకరిస్తారా? తిరస్కరిస్తారా? అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.
పవన్ కల్యాణ్ రాజకీయ వాంఛలు, ఆశలకు భిన్నంగా ఆ ఆఫర్ ఉండడమే అందుకు కారణం! ఇంతకూ ఆ ఆఫర్ ఏమిటా అనుకుంటున్నారా? పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా కాకుండా, ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు రావాలని, ఆయనకు కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమిత్ షా ఆఫర్ ఇచ్చినట్టుగా ఇప్పుడు ఒక ప్రచారం వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేయగా రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారు. ఈ సారి మళ్లీ అలాంటి ఓటమి భంగపాటు ఎదురుకాకుండా ఉండేందుకు ఆచితూచి పావులు కదుపుతున్నారు. ఈలోగా అమిత్ షా నుంచి కేంద్రమంత్రి పదవి ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది.
ఆ ఆఫర్ కారణంగానే.. జనసేన తరఫున తొలిజాబితాలో కొన్ని పేర్లు ప్రకటించినప్పటికీ.. అందులో అధినేత పవన్ పేరు లేదని ఇప్పుడు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఇప్పుడు డోలాయమాన పరిస్థితిలో ఉన్నారు. ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
ఆయనకు మనసులో ముఖ్యమంత్రి పదవి మీద కోరిక ఉంది. ఏపీలో అధికారంలోకి వస్తే సీఎం సీటును షేర్ చేసుకోవచ్చునని.. తద్వారా ముఖ్యమంత్రి గా ఒక వైభవం అనుభవించవచ్చుననే ఆశ ఉంది. అయితే ఇక్కడ తమ కూటమి ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తుందనే గ్యారంటీ లేదు. అలాగే, తనమీద వైఎస్సార్ సీపీ గట్టిగా కాన్సంట్రేట్ చేస్తే తాను ఎమ్మెల్యేగా గెలుస్తాననే నమ్మకం కూడా లేదు.
అదే ఎంపీగా పోటీచేసినట్లయితే.. ఒకచోట కాకపోయినా మరోచోట కాస్త ఓట్లు రాబట్టుకున్నా.. ఎంపీ అయిపోవచ్చు. కేంద్రంలో మోడీ సర్కారు గ్యారంటీగా ఏర్పడుతుంది. తాను గెలిస్తే గ్యారంటీగా మంత్రి పదవి దక్కుతుంది. మరి అమిత్ షా ఆఫర్ ను అంగీకరించి అటు మొగ్గాలా? లేదా, ముఖ్యమంత్రి పదవి మీద ఆశతో ఏపీ ఎమ్మెల్యేగానే పోటీచేయాలా? అనేది ఆయన ఊగిసలాటకు కారణమవుతోంది.
ఒకవైపు చంద్రబాబునాయుడు మాత్రం పవన్ ను ఏపీ రాజకీయాల్లో ఉండడానికే ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే.. జగన్ ను మరీ చవకబారుగా తిట్టడానికి పవన్ ఆయనకు ఉపయోగపడుతున్నాడు. ఆయన ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లితే.. ఆలోటు తెలిసిపోతుందని ఆయన భయపడుతున్నారు. మరి పవన్ చంద్రబాబు స్కెచ్ కు లొంగిపోయి, ఆయన పల్లకీ మోయడానికి తాను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటారో.. వలచి వచ్చిన బంపర్ ఆఫర్ ను వాడుకుని కేంద్రమంత్రి అవుతారో ఆయన తేల్చుకోవాలి.