భారతీయ జనతా పార్టీకి ఇన్నాళ్లుగా సారథ్య బాధ్యతలు నిర్వహిస్తూ ఆ పార్టీ తెలుగుదేశం తో పొత్తు పెట్టుకోవడానికి ఇతోధికంగా తన వంతు కష్టం చేసిన దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పుడు తన అంతరంగాన్ని మరో రకంగా కూడా ఆవిష్కరిస్తున్నారు. మూడు పార్టీల పొత్తులు ఖరారైన తర్వాత.. పురందేశ్వరి తన మాటల్లో జగన్ అరాచక ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్నదని అంటున్నారు. అదే సమయంలో.. రాముడికి ఉడుతసాయం కూడా అవసరమైందిన పురందేశ్వరి అనడమే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
జగన్ ను రావణాసురుడి పాలనతో పోల్చడం ద్వారా ఆమె ఒకరకమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నట్లయితే గనుక ఓకే.. దాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఆమె దృష్టిలో రాముడెవరు? రాముడికి సాయం చేయడానికి వచ్చిన ఉడుత ఎవరు? ఇదే ప్రశ్న ప్రజలందరికీ ఎదురవుతోంది!
ఎందుకంటే.. జగన్ ను ఓడించాలనే కోరిక, అవసరం భారతీయ జనతా పార్టీది గానీ, నరేంద్రమోడీది గానీ కాదు! జగన్ ను ఓడించి ఇప్పటికిప్పుడు వారు అధికారంలోకి వచ్చేసేది కూడా లేదు. జగన్ గెలిచినంత మాత్రాన వారికి నష్టం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు దాదాపుగా అన్ని ఎన్డీయే బిల్లులకు ఉభయ సభల్లో మద్దతు తెలియజేస్తూనే ఉన్నారు. ఇలాంటి అర్జంటుగా జగన్ ను ఓడించేయాలనే కోరిక వారిది కాదు. ఆ కోరిక ఉన్నది చంద్రబాబునాయుడుకు, పవన్ కల్యాణ్ కు మాత్రమే. చివరిసారిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనే కోరిక చంద్రబాబుకు, అవకాశం వస్తే ఆ పదవిని షేర్ చేసుకునే చాన్సు దక్కుతుందని పవన్ కల్యాణ్ కు ఆశ ఉంది.
మరి వీరిద్దరిలో రాముడు ఎవరు అని పురందేశ్వరి భావిస్తున్నారో ఆమె కాస్త క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మరిదిని చివరిసారిగా పదవిలో కూర్చోబెట్టడానికి ఆమె తహతహలాడుతున్నారు గనుక.. చంద్రబాబునే రాముడిగా అభివర్ణిస్తుండవచ్చునని పలువురు అంటున్నారు. చంద్రబాబు రాముడైతే మరి నరేంద్ర మోడీ ఉడుత వంటి సాయం చేస్తున్నారని ఆమె అభిప్రాయపడుతున్నారో అనేది కీలకం ఇక్కడ.
ఒక్క శాతం ఓటు బ్యాంకు ఉన్న భాజపాను కూడా పొత్తుల్లోకి కలుపుకోవడంలో.. ఉడత అనేది భాజపా మాత్రమే అని స్పష్టంగానే తెలిసిపోతోంది. తాను ఉన్న పార్టీనే ఉడతగా అభివర్ణించడం పురందేశ్వరికి మాత్రమే చెల్లిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలనే కోరికతోనే పురందేశ్వరి ఇన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీకి సారథ్యం చేస్తూ వచ్చారని, అందుకు అనుకూలంగానే రాష్ట్ర పార్టీ నుంచి నివేదికలు కూడా పంపారు. ఇన్నాళ్లకు పొత్తు కూడా కుదిరిన తర్వాత.. చంద్రబాబు రాముడని, తమ పార్టీ ఉడుత సాయం చేస్తోందని ఆమె తన అంతరంగాన్ని బయటపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.