పొత్తులు ఖరారయ్యాయి. మరోసారి టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి రంగంలోకి దిగుతున్నాయి. పైకి అధికారికంగా ప్రకటించనప్పటికీ సీట్ల పంచాయితీ కూడా దాదాపు కొలిక్కి వచ్చేసింది. ఇక మిగిలింది ప్రచారమే. మరి ఈసారి జనసేన తరఫున మెగా హీరోలు ఎవరు ప్రచారంలోకి రాబోతున్నారు?
“పవన్ ఆదేశిస్తే మేం ఎప్పుడూ సిద్ధమే..” అల్లు అర్జున్ తప్ప మిగతా మెగా హీరోలంతా నిత్యం చెప్పే మాట ఇదే. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ప్రచారానికి వచ్చేది ఒకరిద్దరు మాత్రమే. ఇంకా చెప్పాలంటే గత ఎన్నికల్లో ప్రచారం చేసిన వాళ్లే ఈసారి కూడా రోడ్లపై కనిపించే అవకాశం ఉంది.
బాబాయ్ అంటే రామ్ చరణ్ కు ఇష్టమే. కానీ ఆయన కోసం ప్రచారం చేయాలంటే తండ్రి చిరంజీవి అనుమతి తప్పనిసరి. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా పద్మవిభూషణ్ అందుకున్న సమయంలో కూడా చిరంజీవి రాజకీయాలపై విస్పష్ట ప్రకటన చేశారు.
సో.. ఇలాంటి టైమ్ లో కొడుకును పవన్ కోసం ప్రచారానికి పంపిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రహీరోగా కొనసాగుతున్నాడు. టీడీపీ-జనసేన కూటమి కోసం అతడు ప్రచారంలోకి దిగితే, ఆ ప్రభావం అతడి సినీ కెరీర్ పై పడుతుందనే భయం చిరంజీవిలో ఉంది. సో.. టీడీపీ-జనసేన కోసం చరణ్ ప్రచారం చేస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇక మెగా కాంపౌండ్ లో మరో టాప్ హీరో అల్లు అర్జున్. ఇతడు టీడీపీ-జనసేన కూటమికి ప్రచారం చేయడనే సంగతి చిన్నపిల్లాడ్ని అడిగినా చెబుతాడు. మెగా హీరోల్లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ ను, సైన్యాన్ని సిద్ధం చేసుకున్న బన్నీ, ఏపీ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నాడు. ఆ మాటకొస్తే అన్ని రాజకీయ పార్టీలకు సమదూరం పాటిస్తున్నాడు. అది జనసేన అయినా సరే.
ఇక మిగిలింది సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్. వీళ్లలో వరుణ్ తేజ్ తప్పనిసరిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడు. పవన్ కోసం కాకపోయినా, తండ్రి నాగబాబు కోసమైనా వరుణ్ తేజ్ ప్రచార రథం ఎక్కాల్సిందే. అతడితో పాటు నిహారిక కూడా ఉంటుంది.
ఇక సాయిదుర్గతేజ్ ప్రచారానికి ఎప్పుడూ సిద్ధమే. ఇతడు కూడా పవన్ కోసం కాకపోయినా, నాగబాబు కోసం రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇక అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు ప్రచారానికి వచ్చినా రాకున్నా ఒకటే.