ఎంత మంది కష్టమో..ఈ పొత్తు

ఈ రోజు భాజపా నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు తేదేపా-జనసేనలతో పొత్తు వుంటుందని నమ్మని వారు చాలా మందే వున్నారు. భాజపా ఏదో డ్రామా ఆడుతోందని, తేదేపా-సేనలకు లాస్ట్ మినిట్ షాక్ ఇస్తుందని…

ఈ రోజు భాజపా నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు తేదేపా-జనసేనలతో పొత్తు వుంటుందని నమ్మని వారు చాలా మందే వున్నారు. భాజపా ఏదో డ్రామా ఆడుతోందని, తేదేపా-సేనలకు లాస్ట్ మినిట్ షాక్ ఇస్తుందని అనుకుంటూ వచ్చారు. కానీ ఆంధ్రలో తేదేపా అధికారంలోకి రావడం కన్నా, జగన్ ను గద్దె దింపడం అనే అవసరం ఎందరికో వుంది.

ఈ ఒక్కసారి జగన్ అనవాడు అధికారంలోకి వస్తే, చాలా మంది జీవితాలు ఖతమ్ అయిపోతాయి. భవిష్యత్ లు అంధకారం అయిపోతాయి. అందువల్ల భాజపా ఇగోను పక్కకు పెట్టేలా చేసి కూర్చో పెట్టే బాధ్యత తీసుకున్నవారు కొందరు. పవన్ మెడలు వంచో, చంద్రబాబు ను అంగీకరించేలా చేసో, మొత్తం మీద సానుకూలం చేసిన వారు మరి కొందరు.

ఈ పొత్తు ఘనత ఒక్కరిది కాదు. బయటకు కనిపించేది పవన్.. బాబు.. అవతల అమిత్ షా. కానీ ఈ బంధం కలవడానికి ఎందరో మహానుభావులు ఎంత సాయం చేసారో లెక్క వేసుకుంటూ అనేకానేక మంది తేల్తారు. అందరికన్నా ఓ మీడియా టైకూన్ తన పరపతి సమస్తం ఈ పొత్తు కోసం పణం పెట్టారు. ముదిమి మీద పడిన వేళ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి లేదు. మరోసారి జగన్ వస్తే ఎంతకు తెగిస్తారో తెలియదు. మనుటయా? మరణించుటయా? అనే పరిస్థితి. ఇంక ఏం చేయాలి. తన సర్వస్వం పణం పెట్టాలి. అవసరం అయితే తన వ్యాపారంలో మరి కొంత వాటా, లేదా విభాగం ‘కోరుకుంటున్న’ వారికి విక్రయించాలి. ఏదో ఒకటి చేసి, పొత్తును సానుకూలం చేయాలి. అదే చేసారు.

ఇంకా మరి కొన్ని మీడియా సంస్థలు వున్నాయి. వీళ్లకు అంతటి ప్రమాద పరిస్థితి లేదు కానీ, పంతం వుంది. తమ సామాజిక వర్గానికి కాకుండా వేరే వాళ్లకి అధికారం వుండడం ఏమిటి అనే పంతం. దాంతో నిత్యం ఎంత ఊదరకొట్టాలో అంతా ఊదరకొట్టారు. ఆ విధంగా పరిస్థితికి జగన్ కు వ్యతిరేకంగా వుందనే భావన ప్రచారం చేసారు.

ఆ తరువాత బలమైన సామాజిక వర్గం వుండనే వుంది. ఎవరిని, ఎక్కడ, ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంది. ఫేక్ సర్వే లు రోజూ ఏదో ఒకటి వచ్చేలా చేసింది. అవన్నీ కలిపి ఓ ఫైల్ తయారయింది. ఇక సంఘ్ లో పలుకుబడి కలిగిన వారు అటు నుంచి నరుక్కు వచ్చారు. ఇటు పార్టీలో వత్తిడి, అటు సంఘ నుంచి వత్తిడి కలిసి మోడీ మీద పని చేసాయి.

పురందేశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా నియమించినపుడే తేదేపా-భాజపా పొత్తు ఖరారైపోయింది. ఇప్పటి వరకు జరుగుతున్నది అంతా లాంఛనమే. 32 సీట్లు జనసేనకు ఇస్తారని వార్తలు వచ్చి, 24 కు సరిపెట్టినపుడే అర్థం అయిపోయింది. ఆ ఎనిమిదీ భాజపా కోసం పక్కన పెట్టారని. 2019 ఎన్నికల ముందు భాజపాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పవన్ ఎన్నికల వెంటనే భాజపా ముంగిట్లో వాలినపుడే మీడియా కోడై కూసింది. చంద్రబాబును భాజపాకు దగ్గర చేయడం కోసమే ఈ రాయబారం అని. సుజన, సిఎమ్ రమేష్ లాంటి వాళ్లు భాజపాలో చేరినపుడే అర్థంమైంది భాజపా-తేదేపా బంధం ఎలా వుండబోతోందో.

అయితే భాజపా బాగా తెలివైన పార్టీ. అధికారంలో వున్నది జగన్. ఎంపీలు వున్నది జగన్ కు. అందుకే అయిదేళ్లూ జగన్ తో అంటకాగుతున్నట్లు నెట్టుకువచ్చింది. ఇప్పుడు పనైపోయింది. మళ్లీ జగన్ గెలిస్తే చూసుకోవచ్చు. అందరి వత్తిడులు అలా వున్నపుడు తాను మాత్రం చేయగలదు, అందుకే ఇటు వచ్చింది.

అంతా బాగానే వుంది. 

బలమైన సామాజిక వర్గం, దానికి వున్న ప్రసార, ప్రచార సాధనాలు, పలుకుబడి అన్నీ కలిసి పొత్తు కలిసింది. కానీ అవి అన్నీ ఫలించక, మరోసారి జగన్ అధికారంలో వస్తే…వేటాడేస్తాడు. ఎందుకంటే అక్కడ వున్నది వైఎస్, చంద్రబాబు కాదు. జగన్.