టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి రానున్న ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోనున్నాయి. కూటమిలోకి బీజేపీ రావాలనే పవన్‌కల్యాణ్ కోరిక నెరవేరింది. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు ఎమ్మెల్యే, ఐదు లేదా ఆరు లోక్‌సభ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించినట్టు ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దీనిపై ఏపీ బీజేపీ నేతలెవరూ నోరు మెదపలేదు. దీంతో అన్నే సీట్లు ఇస్తున్నట్టు ప్రజానీకం కూడా నిర్ధారించుకున్నారు.
ఈ నేపథ్యంలో పొత్తుపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తొలిసారి నోరు విప్పారు. పొత్తు ఖరారైనట్టు ఆమె పేర్కొన్నారు. అయితే పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు, ఏయో నియోజకవర్గాలు ఇస్తారనే విషయమై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆమె తేల్చి చెప్పారు. దీంతో ఢిల్లీలో నియోజకవర్గాలతో సహా క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.
టీడీపీతో పొత్తు కుదరడంపై ఏపీ బీజేపీ నేతలెవరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పొత్తుపై బీజేపీలోని టీడీపీ అనుకూల నేతలు సంతోషంగా ఉన్నారు. తక్కవ సీట్లకు అంగీకరించారడంపై నిఖార్సైన బీజేపీ నేతలు మాత్రం అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. సీట్ల విషయానికి వస్తే తాము కోరుకున్నట్టు కాకుండా, టీడీపీ అనుకున్న సీట్లు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. సీట్లు, నియోజకవర్గాల ప్రకటన వస్తే తప్ప, ఈ పొత్తులోని బలం లేదా డొల్లతనం ఏంటో తెలిసే అవకాశం లేదు.
మేనిఫెస్టోపై పురందేశ్వరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏం ఆశిస్తున్నారనే అంశంపై రెండు బాక్సులను ఏర్పాటు చేస్తామన్నారు. తొమ్మిది జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్టు పురందేశ్వరి వెల్లడించారు. పొత్తు ఖరారవడం సంతోషంగా వుందని ఆమె చెప్పారు.