పొత్తుల ఎత్తులు.. ముంచితే ప‌రిస్థితేంటి?

తెలుగుదేశం పార్టీని దాని జాతీయాధ్య‌క్షుడు గ‌ట్టిగానే తాక‌ట్టు పెడుతున్న‌ట్టుగా ఉన్నారు! ఆయ‌న చేస్తున్న‌దంతా ఎలాగోలా ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికే కాబోలు! అయితే.. ఒక్క ప‌ర్యాయం అధికారం కోసం మ‌రీ ఇంత‌లా దిగ‌జారాలా? అనే…

తెలుగుదేశం పార్టీని దాని జాతీయాధ్య‌క్షుడు గ‌ట్టిగానే తాక‌ట్టు పెడుతున్న‌ట్టుగా ఉన్నారు! ఆయ‌న చేస్తున్న‌దంతా ఎలాగోలా ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికే కాబోలు! అయితే.. ఒక్క ప‌ర్యాయం అధికారం కోసం మ‌రీ ఇంత‌లా దిగ‌జారాలా? అనే ప్ర‌శ్న ఇక్క‌డ ఉత్ప‌న్నం అవుతోంది. అయితే చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎప్పుడూ మోర‌ల్స్ అనేవి ఉండ‌వు. చంద్ర‌బాబు రాజ‌కీయ అడుగులు ఎక్క‌డికి ప‌డినా అవి అవ‌స‌రార్థ‌మే త‌ప్ప మ‌రో కార‌ణం క‌నిపించ‌దు! అలాంటి అప‌రఅవ‌కాశ‌వాది చంద్ర‌బాబు నాయుడు! ఈ అవ‌కాశ‌వాదికి అటు బీజేపీ అయినా, ఇటు ప‌వ‌న్ క‌ల్యాణ్ అయినా, మ‌రోవైపు కాంగ్రెస్ అయినా ఎప్ప‌టిక‌ప్పుడు అలా క‌లిసి వ‌స్తూ ఉంటాయి.

చంద్ర‌బాబు విసిరే వీర ముష్టి సీట్ల కోసం ఆ పార్టీలు ఈయ‌న క‌థ అయిపోయిన ప్ర‌తిసారీ అవి జాకీలు వేసి లేపుతూ ఉంటాయి. అలా లేపిన త‌ర్వాత అయినా చంద్ర‌బాబు కుదురుగా ఉంటారా అంటే.. అలాంటిదేమీ ఉండ‌దు. అవ‌స‌రం మారిందంటే.. బీజేపీని, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కూడా చంద్ర‌బాబు శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించ‌గ‌ల‌రు. ఇందులో ఎవ‌రికీ సందేహం లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అహంకారం కొద్దీ చంద్ర‌బాబు దృత‌రాష్ట్ర కౌగిలిలో కొన‌సాగుతూ ఉన్నాడు. మ‌రి మాటెత్తితే విలువ‌ల గురించి మాట్లాడే బీజేపీ కూడా ఎప్పుడో విలువ‌ల వ‌లువ‌లు వ‌దిలేసుకుంది. నాలుగు సీట్ల కోసం ఆ పార్టీ కూడా ఏ దోస్తీకి అయినా రెడీ అయిపోతోంది. త‌ను విప‌రీతంగా విమ‌ర్శించిన కాంగ్రెస్ వాళ్ల‌కే బీజేపీ కండువాలు వేస్తోంది. అలాంటిది చంద్ర‌బాబుతో దోస్తీ పెద్ద వింత కాదు క‌మ‌లం పార్టీ తీరులో!

ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇన్ని పొత్తులు పెట్టుకున్నా, ఇంకా పొత్తుల‌ను పెంచినా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌తో గ‌నుక అధికారం అంద‌క పోతే మాత్రం తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు పొలిటిక‌ల్ కెరీర్ కు పూర్తిగా శుభం కార్డు ప‌డిన‌ట్టే! ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పొత్తు, క‌మ‌లం పార్టీతో పొత్తు.. ఇంత‌మందిని తీసుకెళ్లి కూడా జ‌గ‌న్ పార్టీ చేతిలో తెలుగుదేశం పార్టీ గ‌నుక భంగ‌ప‌డితే.. ఏపీ రాజ‌కీయ చిత్రం నుంచి తెలుగుదేశం అంకం ముగింపు మొద‌లైన‌ట్టే!

కూట‌మి పొత్తుతో కూడా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అందుకోలేక‌పోతే.. ఆ కూట‌మిలోని పార్టీలే తెలుగుదేశాన్ని క‌బ‌ల‌యిస్తాన‌డంలో విశేషం లేదు. ప్ర‌త్యేకించి బీజేపీ అలాంటి అవ‌కాశాన్ని ఫుల్ గా  వాడుకునే అవ‌కాశం ఉంది. ఒక‌వైపు  వేరే పార్టీల‌తో దోస్తీ చేస్తూనే దాన్ని క‌బ‌లించ‌డం క‌మ‌లం పార్టీకి ఇప్పుడు బాగా అల‌వాటు! దీని కోసం తాత్కాలికంగా కొన్ని త్యాగాల‌కు కూడా బీజేపీ రెడీగా ఉంటోంది.

బిహార్ లో నితీష్ కుమార్ ను బీజేపీ వాళ్లే సీఎంను చేయ‌డం వెనుక కూడా ప‌క్కా వ్యూహం ఉంది. తాత్కాలికంగా బీజేపీ అక్క‌డ సీఎం సీటు పొంద‌లేక‌పోయినా.. త‌న వ్యూహాల‌తో జేడీయూకు భ‌విష్య‌త్తే లేకుండా చేస్తోంది! జేడీయూకు కాసేపు తోక‌గా వ్య‌వ‌హ‌రించినా, జేడీయూ తోక‌ను పూర్తిగా క‌ట్ చేయ‌డానికి క‌మ‌లం పార్టీ రెడీగానే ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి జేడీయూను రాజ‌కీయ ముఖ‌చిత్రం నుంచి పూర్తిగా త‌ప్పించి, దాన్ని త‌న‌లో క‌లిపేసుకునే వ్యూహాన్ని క‌మ‌లం పార్టీ అక్క‌డ అమ‌లు ప‌రుస్తోంది.

మ‌హారాష్ట్ర‌లో కూడా ఇదే తీరు. అక్క‌డ చీలిక వ‌ర్గాల‌కు ప్రాముఖ్య‌త‌ను ఇస్తూ.. దీర్ఘ‌కాలంలో వాటి ఉనికినే లేకుండా చేసేలా ప‌డుతున్నాయి క‌మ‌లం పార్టీ అడుగులు. బీజేపీకి చంద్ర‌బాబు విష‌యంలో కూడా మొమ‌మాటాలు ఏమీ ఉండ‌వు. ఎలాగూ చంద్ర‌బాబుకు వ‌య‌సు మీద‌ప‌డుతూ ఉంది, వార‌సుడేమో స‌మ‌ర్థుడు కాద‌నే అభిప్రాయం ఏర్ప‌డింది. చంద్ర‌బాబే ద‌త్త‌పుత్రుడి మీద ఆధార‌ప‌డుతున్నారాయె! ఇలాంటి నేప‌థ్యంలో బీజేపీతో స్నేహం అనేది తెలుగుదేశం పార్టీకి దీర్ఘ‌కాలంలో మేలు క‌న్నా ప్ర‌మాద ఘంటిక‌ల‌ను అయితే మోగిస్తూ ఉంది.

అధికారాన్ని అందుకున్నా అందుకోలేక‌పోయినా.. ఇప్పుడు చంద్ర‌బాబు త‌నంతకు త‌నే బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయారు. బీజేపీ ఎన్నో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను కేటాయించి, అక్క‌డ మ‌ళ్లీ త‌ను చెప్పిన వాళ్ల‌నే నిల‌బెట్టేసి మొత్తం గేమ్ త‌నే అడేసుకోవ‌చ్చ‌నే లెక్క‌ల చంద్ర‌బాబుకు ఉండొచ్చు. అయితే ఇది మునుప‌టి బీజేపీ కాదని మాత్రం చంద్ర‌బాబుకు కూడా తెలిసే ఉండాలి. అధికారం కోసం ఎంత‌కైనా తెగించే తీరున ఉన్నాయి క‌మ‌లం పార్టీ రాజ‌కీయాలు సాగుతున్నాయి. అధికారం కోసం ఎవ‌రినైనా బీజేపీ తెర మీద‌కు తీసుకురాగ‌ల‌, ఎవ‌రినైనా తెర వెన‌క్కు తోయ‌గ‌ల నేర్పుతో ఉంది. అది కూడా మిత్ర‌ప‌క్షాల‌నే బీజేపీ ఎక్క‌వ‌గా మ‌డ‌తేస్తోంద‌ని కూడా గ‌మ‌నించ‌వ‌చ్చు!