తెలుగుదేశం, బీజేపీ, జనసేన.. ఈ కూటమి కొత్త కాదు. 2014 ఎన్నికల సమయంలో తొలి సారి ఈ కూటమి ఏర్పడింది. ఎన్నికలకు నెలల ముందు పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ .. కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అంటూ నినదించాడు. అప్పటి వరకూ కమ్యూనిస్టు పలుకులు పలికి, చేగువేరా పోజులు ఇచ్చి పవన్ కల్యాణ్ ఆ ఎన్నికల సమయంలో అపర కాషాయవాదిగా మారారు. ప్రశ్నించడానికే పార్టీ అన్నారు, తన మద్దతుతో అధికారంలోకి వస్తే టీడీపీని సైతం ప్రశ్నిస్తానంటూ అప్పట్లో పీకే ప్రకటించుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే!
2019 నాటికి మాత్రం ఈ మూడు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేశాయి. అందులో ప్రధానంగా పవన్ కల్యాణ్ వెళ్లి కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం.. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేక ఓటును చీల్చాలనే వ్యూహంతోనే అనేది క్లారిటీ ఉన్న అంశమే! కేవలం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే పవన్ కల్యాణ్ ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేక ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడకుండా చీల్చే వ్యూహానికి అనుగుణంగా పవన్ పని చేశారు. అయితే ప్రజలు పవన్ ను రెండు చోట్లా ఓడించారు.
అలాంటి రాజకీయ వ్యూహం ఫలించని నేపథ్యంలో.. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. పవన్ ను వేరేగా పోటీ చేయించడం కన్నా తనతో కలుపుకుని పోటీ చేయించడమే మంచిదనే లెక్క చంద్రబాబు వద్ద ఉందిప్పుడు! 2019లో జనసేన పొందిన ఓట్లన్నీ ఇప్పుడు గంపగుత్తగా టీడీపీకి పడతాయని.. ఇది తనను మళ్లీ అందలం ఎక్కిస్తుందనే లెక్కలో చంద్రబాబు ఉన్నారు. ఎలాగూ సొంతంగా పోటీ చేసి ఏనాడూ గెలిచిన చరిత్ర లేదు. సొంతంగా పోటీ చేస్తే వచ్చే సీట్లు 23 అని క్లారిటీ ఉంది. దీంతో జనసేనను చంద్రబాబు ఎడాపెడావాడేసుకుంటున్నారు. అయితే ఇక్కడికీ విశ్వాసం కలగక.. బీజేపీని కూడా పొత్తుకు దించుకున్నారు.
బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి కొంత డ్యామేజ్ తప్పదు. ప్రత్యేకించి.. ఏపీలో చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకును టీడీపీ మరిచిపోవాల్సిందే అనే పరిస్థితి ఏర్పడింది. బీజేపీతో దోస్తీ తెలుగుదేశం వీరాభిమాన మైనారిటీ వర్గాలకు కూడా మింగుడుపటం లేదు! ఇది తెలిసీ చంద్రబాబు కమలంతో దోస్తీకే ఆరాటపడుతున్నారు. అందుకు కారణం.. బీజేపీతో పొత్తు ఉంటే ఎలక్షన్ మేనేజ్ మెంట్ ఈజీగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ఓడినా.. కేంద్రంలో ఎలాగూ బీజేపీనే పవర్ లోకి వస్తుంది కాబట్టి.. కనీసం కేసులు, అరెస్టుల విషయంలో రక్షణ ఉంటుందని చంద్రబాబు లెక్కేసి ఉండొచ్చు. అధికారం దక్కకపోయినా.. అరెస్టుల భయాలతో చంద్రబాబు ఇప్పుడు కమలం పంచన చేరారని స్పష్టం అవుతోంది.
మరి చంద్రబాబు లెక్కల ప్రకారమే ఈ పొత్తులన్నీ విచ్చుకుంటున్నాయి, కానీ ఇప్పుడు తేలాల్సింది ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది! తమ సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడు జనసేన వల్ల కాపుల ఓట్లు, బీజేపీకి ఉన్న ఒకటీ అర శాతం ఓట్లు కలిసి వస్తే.. 2014 తరహాలో తను మళ్లీ సీఎం అయిపోవచ్చని చంద్రబాబు ఈ పొత్తులను డిజైన్ చేసుకుంటున్నారు. టీడీపీ వీరాభిమానులు కూడా 2014 తరహాలో ఈ సారి కనీసం అప్పట్లానే ఒకటిన్నర శాతం ఓట్లతో బయటపడతామనే లెక్కల్లో బిజీగా కనిపిస్తున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసాలున్నాయనేది నిష్టూరమైన సత్యం!
2014లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మొత్తంగా రాష్ట్రమంతా కలిపి ఐదున్నర లక్షల ఓట్లు అదనంగా పొందింది. అలా ఒకటిన్నర శాతం అదనపు ఓట్లతో చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే అప్పుడు వీచిన మోడీ గాలి చంద్రబాబుకు ఆ ఒకటిన్నర శాతం అదనపు ఓట్లను సంపాదించి పెట్టింది. దేశమంతా కాంగ్రెస్ గాలి బలంగా వీచిన సందర్భం అది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నేతలతోనే నిండిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ మేరకు కుదుపులకు లోనైంది!
అప్పుడు ఉండిన మోడీ వేవ్ చంద్రబాబుకు పెద్ద అడ్వాంటేజీగా నిలిచింది. దానికితోడు పవన్ కల్యాణ్ ప్రచారపర్వం కూడా అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది. ఒకవేళ ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరి పోరుకు వెళ్లి ఉంటే, ఈ పాటికి టీడీపీ ఏపీ రాజకీయ తెరపై కూడా ఉండేది కాదేమో! మరి అప్పటికీ ఇప్పటికీ ఉన్నతేడాల్లో ప్రధానమైనది మోడీ వేవ్ ఆ స్థాయిలో లేకపోవడం. 2014 లో సౌత్ లో కూడా మోడీ గాలి సాధారణ స్థాయి కన్నా గట్టిగానే వీచింది. కాంగ్రెస్ తీరుపై విసిగివేసారి పోయిన జనాలు మోడీ అద్భుతాలు చేస్తారని నమ్మారు.
మోడీపై అప్పుడున్న అంచనాలు వేరు, ఆయన పదేళ్ల పాలన తర్వాత ఉన్న అంచనాలు వేరే! రామమందిరం అంశం మోడీ ఇమేజ్ ను పెంచి ఉండొచ్చు గాక, కానీ 2014లో మోడీ రావాలి.. అని బలంగా ఉండిన వేవ్ ఇప్పుడు లేదు, ప్రత్యేకించి ఏపీలో అయితే అలాంటి ముచ్చటేమీ లేదు! చంద్రబాబు కూడా మోడీతో అవకాశవాద పొత్తులనే పెట్టుకుంటున్నారు. అవసరం ఉన్నప్పుడు పొత్తు అంటున్నారు, లేకపోతే తిడుతున్నారు. కాబట్టి ఈ దోస్తీపై కూడా మునుపటి అంచనాలు ఏమీ లేవు! మోడీని అనరాని మాటలన్నీ అన్నారు చంద్రబాబు, రేపటి ఎన్నికల ప్రచారంలో వీరిద్దరూ భుజాలు కలుపుతూ సభలకు ఎక్కినా .. జనాలకు పాత కథలే గుర్తుకొస్తాయి తప్ప, అద్భుతాలు జరుతాయనే అంచనాలు ఏమీ ఏర్పడవు!
ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు కేటాయించినా టీడీపీ ఆ మేరకు నష్టం కచ్చితంగా జరుగుతుంది. అది పది అసెంబ్లీ సీట్లు అయినా, ఐదు ఎంపీ సీట్లు అయినా.. టీడీపీకి బీజేపీ బలం వల్ల కలిసి రావడం కన్నా.. బీజేపీకి కేటాయించిన సీట్లను తెలుగుదేశం పార్టీ మరిచిపోవాల్సిన పరిస్థితులు తప్పకపోవచ్చు! అలాగే నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ది ప్రచార పాత్ర!
అప్పటికే జనసేన పెట్టినా, తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్ తరహాలో పవన్ కల్యాణ్ అప్పుడు పని చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని పవన్ అప్పుడు చేసిన ప్రచారం టీడీపీకి ఎన్నో కొన్ని ఓట్లను తెచ్చిపెట్టింది. కాపు ఓటర్లను ప్రభావితం చేసింది. పవన్ సినీవీరాభిమాన ఓటు టీడీపీకి పడింది! ఇవన్నీ కాకుండా.. అప్పుడు చంద్రబాబు ప్రకటించిన రైతు రుణమాఫీ రాయలసీమలో గట్టిగా పని చేసింది.
అనంతపురం జిల్లాలో అప్పుడు టీడీపీకి 12 అసెంబ్లీ సీట్లు దక్కాయంటే అందుకు ప్రధాన కారణం రైతు రుణమాఫీ హామీనే! అయితే ఆ హామీని చంద్రబాబు అధికారంలోకి రాగానే తుంగలోకి తొక్కారు. విడతల వారీగా అంటూ.. కనీసం వడ్డీల మాఫీ స్థాయి సాయం కూడా అందించకపోయారు. దీంతో చంద్రబాబు మాటలకు ప్రజల్లో విలువ లేకుండా పోయింది. చంద్రబాబు అధికారం కోసం అబద్ధాలు చెబుతారు, ఎన్నికల్లో గెలవగానే మెనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి కూడా డిలీట్ చేయిస్తారనే విషయం ప్రజలకూ క్లారిటీ వచ్చింది.
2014లో టీడీపీని గెలిపించిన బీజేపీ, జనసేన ల ఓట్లు కు తోడు చంద్రబాబు ఇచ్చిన హామీలు అప్పుడు కీలక పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పటి వరకూ ఎన్నికల హామీల విషయంలో చంద్రబాబు వ్యవహరించే తీరు ప్రజల్లోకి గట్టిగా వెళ్లింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఏమైనా చెబుతాడని, ఎన్నికలు కాగానే ఆయన తీరు మారిపోతుందనే క్లారిటీ ప్రజలకు ఇప్పుడు పూర్తిగా ఉంది!
ఇక 2014లో జనసేన కేవలం సపోర్ట్ మాత్రమే చేసింది! సీట్లు అడగలేదు, తీసుకోలేదు! ఇప్పుడు ఆ పార్టీకి ఏకంగా 24 సీట్లను ప్రకటించారు! మరి కాపులు గట్టిగా ఓట్లేస్తారనే లెక్కలతో చంద్రబాబు ఈ మాత్రం కేటాయింపులు అయినా చేశారు. కానీ.. 24 సీట్లలో జనసేనకు ఉన్న క్యాడర్, కార్యకర్తల అండ, పార్టీ నిర్మాణం ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పనక్కర్లేదు. 24 అసెంబ్లీ నియోజకరవర్గాల్లో పోటీకి చంద్రబాబు తనకు అనుమతిని ఇస్తే.. ఇప్పటి వరకూ నాలుగైదు సీట్లలో కూడా పవన్ అభ్యర్థులను ప్రకటించుకోలేదు!
జనసేన తరఫున ఎవరైనా పోటీ చేయాలన్నా..టీడీపీనే అభ్యర్థులను పంపే పరిస్థితి ఉంది! జనసేనకు అయినా, బీజేపీకి అయినా అభ్యర్థులు లేరు, వారికి అభ్యర్థులను కూడా చంద్రబాబే పంపాలి లేదా తెలుగుదేశం ముద్ర వారికి ఎక్కడో ఒక చోట ఉండాలి. పోటీకి దిగుతున్నది చంద్రబాబు మనుషులే అయినా.. జనసేన, బీజేపీ కి తెలుగుదేశం కేటాయించే నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఉత్సాహం కలగొచ్చు. ఒకవేళ పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో కూడా సీట్లు అడగకుండా 2014 తరహాలో ప్రచారం మాత్రమే చేసి పెట్టి ఉంటే టీడీపీకి అప్పట్లానే మేలు జరిగేదేమో!
ఇప్పుడు జనసేన, బీజేపీలు కలిపి పది ఎంపీ సీట్లను, ఒక 40 అసెంబ్లీ సీట్లను టీడీపీ నుంచి తీసేసుకోవడం వల్ల స్వల్ప కాలికంగా కచ్చితంగా మేలు జరిగే పరిస్థితి ఏమో కానీ.. దీర్ఘకాలంలో కూడా ఇది టీడీపీ పునాదులనే దెబ్బతీసే అంశం. ఒంటరిగా పోటీకి వెళ్లే ధైర్యం లేదనే మాటను శాశ్వతంగా బిరుదుగా పొందడంతో పాటు, ఈ వైకుంఠపాళిలో ఓడితే .. టీడీపీ అడ్రస్ కూడా శాశ్వతంగా గల్లంతు అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి!