కాపు ఉద్యమనాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు వేళైంది. ఇటీవల ముద్రగడ దగ్గిరికి ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వెళ్లి చర్చించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించినట్టు మిథున్‌రెడ్డి తెలిపారు. ముద్రగడ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో ముద్రగడ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. జనసేనలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి తాడేపల్లిగూడెం జనసేన ఇన్‌చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, ఇతర నాయకులు వెళ్లి చర్చించారు. ముద్రగడ లాంటి కాపు ఉద్యమ నాయకులు, పెద్దమనిషి ఇంటి దగ్గరికి స్వయంగా పవన్‌కల్యాణే వచ్చి పార్టీ కండువా కప్పుతారని బొలిశెట్టి వెల్లడించారు.
అయితే రోజులు, వారాలు, నెలలు గడిచినా ముద్రగడ ఇంటికి మాత్రం జనసేనాని వెళ్లలేదు. ఇలా రెండుమూడు సార్లు ఇంటి వద్దకు వస్తానని చెప్పి అవమానించారని జనసేనానిపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి వద్దకు రావాలంటే ఇతరుల అనుమతి అవసరమని పరోక్షంగా చంద్రబాబు గురించి ముద్రగడ ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు వెళ్లి చర్చించడం, సానుకూల స్పందన రావడం తెలిసిందే. అనుచరులతో చర్చించి సానుకూల నిర్ణయాన్ని వెల్లడిస్తానని ముద్రగడ వెల్లడించారు. వైసీపీలో చేరడం ఖాయమైందే తప్ప, ఎప్పుడనేది తెలియలేదు. తాజాగా ఈ నెల 14న తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ, ఆయన కుమారుడు గిరి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఆ రోజు కిర్లంపూడి నుంచి భారీ ర్యాలీతో ముద్రగడ వెళ్తారని సమాచారం.