వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రాజకీయం రంజుగా మారింది. బీజేపీతో పొత్తు కుదరడంతో జమ్మలమడుగు అభ్యర్థిపై కొత్త చర్చకు తెరలేచింది. ప్రస్తుతం జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి ఉన్నారు. టికెట్ తనకే వస్తుందని కొండంత ఆశతో ఆయన కొన్నేళ్లుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మొదటి విడత జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన నిరుత్సాహానికి గురయ్యారు.
తాజాగా బీజేపీతో పొత్తు కుదరడంతో జమ్మలమడుగు టికెట్ తనకే అని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అంటున్నారు. తన సీటు కోసం టీడీపీతో పొత్తు ఉండాలని ఆదినారాయణరెడ్డి కోరుకుంటున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఆది కోరుకున్నట్టుగానే టీడీపీతో పొత్తు ఖరారైంది. పొత్తులో భాగంగా జమ్మలమడుగు సీటు ఇస్తారనే ధీమాలో ఆదినారాయణరెడ్డి ఉన్నారు. అదే జరిగితే టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన తన సంగతి ఏంటని భూపేష్‌రెడ్డి ప్రశ్నించనున్నారు.
ఒకే కుటుంబం కావడంతో టికెట్ ఎవరికి కావాలో తేల్చుకోవాలని చంద్రబాబు చెబుతారని అంటున్నారు. అయితే రాజకీయాల్లో బంధుత్వాలకు చోటు లేదు. ఎవరి ప్రయోజనాలు వారికే సొంతం. భార్యాభర్తలే వేర్వేరు పార్టీల్లో వుంటున్న పరిస్థితి. అలాంటిది బాబాయి కోసం అబ్బాయిని త్యాగం చేయాలని కోరితే, వినిపించుకునే మాటే ఉత్పన్నం కాదని అంటున్నారు.
భూపేష్‌రెడ్డి వయసులో చిన్నవాడని, ఇంకా భవిష్యత్ వుందని, ఇదొక్క దఫా ఆదినారాయణరెడ్డికి టికెట్ ఇస్తామని సర్ది చెప్పొచ్చని బీజేపీ, టీడీపీ నేతలు అంటున్నారు. సీట్ల కేటాయింపు సమయానికి జమ్మలమడుగు రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.