బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరిన నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఇంతకాలం జనసేనతో పొత్తు వల్ల సీట్ల సర్దుబాటు సమస్య తలెత్తింది. తాజాగా బీజేపీతో పొత్తు ఖరారు కావడంతో కొత్త సమస్య ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఇచ్చే అసెంబ్లీ సీట్లపై చర్చకు తెరలేచింది. బీజేపీకి ఆరు అసెంబ్లీ, ఆరు లోక్‌సభ స్థానాలు ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. తక్కువ సీట్లే అయినప్పటికీ, తమ టికెట్‌కు ఎక్కడ ఎసరు పెడతారో అని టీడీపీ నాయకులు భయపడుతున్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డికి భయం పట్టుకుంది. చంద్రబాబు ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో శ్రీకాళహస్తి లేదు. బీజేపీతో పొత్తు చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే శ్రీకాళహస్తి అభ్యర్థిని ప్రకటించలేదనే చర్చకు తెరలేచింది. తాజాగా బీజేపీతో అధికారికంగా పొత్తు కుదరడంతో శ్రీకాళహస్తి టికెట్ బీజేపీకి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. శ్రీకాళహస్తిలో సుదీర్ఘ కాలంగా టీడీపీ తరపున బొజ్జల కుటుంబం హవా నడుపుతోంది.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చనిపోవడంతో ఆయన కుమారుడు సుధీర్‌రెడ్డి ముందుకొచ్చారు. శ్రీకాళహస్తిలో ఏడాదిన్నరగా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. సుధీర్‌తో పాటు ఆయన తల్లి, భార్య కూడా జనంలోకి వెళుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయకుడు కూడా శ్రీకాళహస్తి టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరి మధ్య టికెట్ వార్ నడుస్తోంది.
దీంతో ఇద్దరికీ కాకుండా బీజేపీ అభ్యర్థి కోలా ఆనంద్‌కు టికెట్ ఇస్తే సమస్య లేకుండా పోతుందని చంద్రబాబు భావనగా చెబుతున్నారు. కోలా ఆనంద్‌కు నియోజకవర్గంలో చెప్పుకోతగ్గ పట్టు వుంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆనంద్‌కు టికెట్ ఇస్తే, జనసేన మద్దతు కూడా తోడు అవుతుంది. ఇక టీడీపీ మద్దతు పలికితే వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డిని ఢీకొట్టొచ్చనేది బీజేపీ వ్యూహం. ఒకవేళ తనను కాదని బీజేపీకి టికెట్ ఇస్తే, బొజ్జల సుధీర్ మద్దతు ఇస్తారా? అనేది ప్రశ్న. మొత్తానికి శ్రీకాళహస్తిలో కూటమి అభ్యర్థిపై కొత్త చర్చకు తెరలేచింది.