ఎన్నికల సీజను దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకుల యొక్క ప్రతి కదలికకు, ప్రతి కలయికకు అర్థం మారిపోతూ ఉంటుంది. కొత్త బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. యిక్కడ పొత్తుబంధం ఏర్పడిందో లేదో ప్రజలకు ఇంకా అర్థం కావడం లేదు గానీ.. ఆయన మాత్రం సీట్ల పంపకం గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా- తెలంగాణలోని బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి.
సివిల్ సర్వీసెస్ మాజీ అధికారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మంచి కీర్తి ప్రతిష్ఠలే ఉన్నాయి. ఆయన తన పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగప్రవేశం చేశారు. బీఎస్పీలో చేరి.. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. అప్పటినుంచి కేసీఆర్ పాలనపై నిప్పులు చెరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా అనేక పాదయాత్రలు చేశారు. సభలు నిర్వహించారు. కొన్నేళ్లుగా కేసీఆర్ వ్యతిరేక ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లడమే తన ఎజెండాగా ఆయన కాలం గడిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి మూడోస్థానంలో నిలిచారు.
ఎన్నికల అనంతరం కేసీఆర్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లి ఆయనను కలిశారు. మాజీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన భేటీగానే అది అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. తీరా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల సమయం వచ్చేసరికి.. తెలంగాణలో భారాసతో బీఎస్పీకి పొత్తు కుదిరిందని ప్రవీణ్ అంటున్నారు.
తమ పార్టీ అధిష్ఠానం అనుమతితోనే భారాసతో పొత్తు చర్చలు జరిగాయని అంటున్నారు. సీట్ల పంపకంపై స్పష్టత వచ్చేదాకా చర్చలు కొనసాగుతూనే ఉంటాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ఎన్ని సీట్లు ఇస్తారని ప్రవీణ్ కుమార్ భావిస్తున్నారో తెలియదు. తమాషా ఏంటంటే.. కేసీఆర్ కు మేలు చేసే రాజకీయాలు చేసి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనతో పొత్తు పెట్టుకోవాలని చూసిన వామపక్షాలు దారుణంగా భంగపడ్డాయి. రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదంటూ కేసీఆర్ తెగేసి చెప్పేసిన తర్వాత.. వారు కాంగ్రెస్ పంచకు చేరి మంతనాలు చేశారు. మొత్తానికి సీపీఐ మాత్రం సభాప్రవేశం చేసింది. 119 స్థానాలుండే అసెంబ్లీలోనే వారికి రెండుకు మించి ఇవ్వడానికి కేసీఆర్ కు మనసొప్పలేదు. అలాంటి 17 సీట్లలో బీఎస్పీకి ఎన్ని ఇస్తారు? అదికూడా మొన్నటివరకు కేసీఆర్ ను తిడుతూ కాలంగడిపిన వారికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు? అనేది ప్రశ్న!
అయినా.. ‘జాతీయ పార్టీ అయిన బీఎస్పీ.. కేంద్రంలోని రెండు కూటముల్లోనూ లేనటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి తమ అధినేత్రి మాయావతి సిద్ధమేనని’ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. కేసీఆర్ అతి కష్టమ్మీద పార్టీ పేరును భారాసగా మార్చి.. ఇతర రాష్ట్రాల్లో శాఖలు ప్రారంభించి రాజకీయం చేస్తోంటే.. ప్రవీణ్ కుమార్ ఇప్పటికీ వారిని ప్రాంతీయ పార్టీగా వ్యవహరిస్తే.. కల్వకుంట్ల వారి ఈగో దెబ్బతినకుండా ఉంటుందా? అనేది ప్రజల సందేహం.