మంచి వస్తువులకు పలానా కంపెనీ బ్రాండ్ అని మాట్లాడుకుంటుంటాం. ఇంటికి లేదా ఆఫీస్‌కు వస్తువులు లేదా సరుకులు కొనుగోలు చేయాలంటే మంచి బ్రాండ్ కంపెనీ గురించి ఆరా తీస్తుంటాం. రాజకీయాల విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఒక బ్రాండ్. అయితే ఈయన బ్రాండ్ ఏంటో జనానికి బాగా తెలుసు. బాబు అనే పొలిటికల్ బ్రాండ్ కంపెనీ గొప్పదని చాటి చెప్పడానికి ఎల్లో మీడియా చాలా కాలంగా మొక్కవోని దీక్షతో పని చేస్తోంది.
వర్తమా, భవిష్యత్ రాజకీయాలకు చంద్రబాబు ఓ ల్యాండ్ మార్క్‌గా మిగిలారు. విలువలేని రాజకీయాలకు ఆయన రోల్ మోడల్‌గా నిలిచారనడంలో అతిశయోక్తి లేదు. వ్యక్తిగత స్వార్థం కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడేవారిని పాతాళంతో పోల్చే వారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు, ఇటు రాష్ట్ర, కేంద్ర కేబినెట్‌లలో అధికారాన్ని పంచుకున్నారు.
2019కి వచ్చే సరికి ప్రధాని మోడీపై తీవ్ర వ్యతిరేకత వుందని భ్రమపడి, ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తే మళ్లీ అధికారంలోకి రావచ్చని కల కన్నారు. ఆ కల కల్లైంది. మూడోసారి మోడీనే అధికారంలోకి వస్తారనే వాతావరణం కనిపించడంతో ఎలాగైనా బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలని కాళ్లావేళ్లా పడ్డారు. చివరికి ఎన్డీఏ గూటికి చేరారు. బాబు అవకాశ వాద రాజకీయాలను చూసిన తెలుగు సమాజం, ఇప్పుడాయన్ను ఏమీ అనడం లేదు. ఎందుకంటే, ఆయన్ను చూసి జనం అంతగా విసిగిపోయారు.
అథఃపాతాళానికి దిగువకు దిగజారిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నోళ్లకైనా ఆత్మాభిమానం వుండాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి లక్ష్మీపార్వతిని అడ్డంపెట్టుకుని ఆయన చేసిన కుట్రలు అన్నీఇన్నీ కావు. అప్పట్లో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ విడుదల చేసిన ఆడియో ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబును అత్యంత నీచుడిగా ఎన్టీఆర్ లోకానికి చాటి చెప్పారు.
చంద్రబాబుతో రాజకీయ స్నేహం ఎలా వుంటుందో తెలిసి కూడా బీజేపీ పదేపదే పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు వల్ల లాభనష్టాల గురించి కాసేపు పక్కన పెడదాం. కనీస నైతిక విలువ సంగతేంటి? ఈ పొత్తు ఇచ్చే సంకేతం, సందేశం ఏంటంటే… రాజకీయాల్లో విలువలనేవి లేవు. అవసరాలు తప్ప, మరేవి రాజకీయాల్లో పని చేయవని ఆ రెండు పార్టీలు తేల్చి చెప్పాయి.
గతంలో గుజరాత్‌లో అల్లర్ల సందర్భంగా మోడీని ముఖ్యమంత్రిగా తప్పించాలని ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. నాడు ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం మోడీపై భారీ విమర్శలు చేశారు. 2014కు వచ్చేసరికి విమర్శలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. ఓకే, అంతా బాగుంది. నాలుగేళ్లు అధికారం పంచుకున్నారు. ఆ తర్వాత మోడీని చంద్రబాబు తిట్టని తిట్టు లేదు. మోడీపై బాబు దూషణలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాబు మాటల్లోని ఆణిముత్యాలు ఏంటంటే…
“మోడీ దేశానికి వాచ్‌మన్ కాదు దగాకోరు. నరేంద్ర మోడీ కరడుగట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు. ఏపీకి అన్యాయం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ లేదు. మనతో పొత్తు పెట్టుకున్నాక గెలిచారు. వాళ్లతో పొత్తు పెట్టుకోకపోతే మరో 15 సీట్లు గెలిచేవాళ్లం. మోడీకి సిగ్గుందా. సిగ్గు, లజ్జ, గౌరవం లేని వ్యక్తి. గ్రామస్థాయి కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే వెయ్యిరెట్లు బెటర్ తమ్ముళ్లు. అది ఆయన స్తోమత. ప్రధాని అబద్ధాలు, అసత్యాలకోరు. పొట్టకొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడరు. కనీసం దండం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం లేని వ్యక్తి నరేంద్ర మోడీ. భార్యనే చూసుకోని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు”
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా ప్రత్యేక హోదాపై అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఏమన్నారో మనందరికీ తెలుసు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చిన తర్వాత ప్రత్యేక హోదాపై బాబు యూటర్న్ తీసుకుని, కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించిన వ్యక్తి చంద్రబాబునాయుడు. బాబును చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గు పడుతుందనే విమర్శ విలువైనది. అందుకే తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు అంటే వంచన, వెన్నుపోటు, మోసం, దగా, అథఃపాతాళానికి దిగజారిన రాజకీయాలకు ఉదాహరణ లాంటివి పర్యాయ పదాలుగా నిలిచాడాయన.
చంద్రబాబు రాజకీయాల గురించి మాట్లాడుకోడానికి సిగ్గేస్తుంది. అసలే రాజకీయాల్లో విలువలు రోజురోజుకూ పతనవమతున్నాయని పౌర సమాజం ఆవేదనతో వుంది. ఇలాంటి సమయంలో బాబు పంథా …రాజకీయాల్లో విలువలు కాంక్షించే వ్యక్తుల్ని భయపెట్టేలా వుంది. అలాగే అవకాశవాద రాజకీయ నాయకులకు చంద్రబాబు ఓ రోల్ మోడల్‌గా నిలిచారు. ఇప్పుడు కాలానికి తగ్గట్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ నాయకులు… చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఓయబ్బా చంద్రబాబు లాంటి 40 ఇయర్స్ ఇండస్ట్రీనే సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తుంటే, ఇక తామెంత అని బాహాటంగానే మాట్లాడుతున్న పరిస్థితి.
2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటికొచ్చి, కాంగ్రెస్‌తో చెట్టపట్టాలేసుకుని తిరగడానికి దేశ ప్రయోజనాలని చంద్రబాబు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి మోడీని ప్రధాని కానివ్వనని శపథం చేశారు. గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రభుత్వ సొమ్ముతో ధర్మపోరాటాలు చేశారు. ఇప్పుడు ఎన్నికలొచ్చే సరికి దేశం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీతో కలుస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. బాబుది నోరా? తాటిమట్టా? తనను చూసి తెలుగు సమాజం నవ్వుకుంటుందనే ఆలోచనే చంద్రబాబుకు లేదు. నవ్వుకునే వాళ్లే సిగ్గుపడతారని ఆయన నమ్మకం.
చంద్రబాబంతా డర్టీయిస్ట్ పొలిటీషియన్ లేరని కేసీఆర్ అన్న మాటలు ఇప్పటికీ, ఎప్పటికీ సజీవంగానే వుంటాయి. చంద్రబాబు రికార్డును ఇప్పట్లో బద్ధలు కొట్టే నాయకుడు కనుచూపు మేరలో కనిపించడం లేదు.