వైసీపీని జనాలు కుర్చీ మడతెట్టి ఇంటికి పంపిస్తారు. అని మాట్లాడితే చాలు టీడీపీ పెద్దలు అంటూంటారు. అయితే సొంత పార్టీ తమ్ముళ్ళే ఇపుడు అవే కుర్చీలు మడతేసి విరగ్గొట్టారు. తమ కోపానికి అంతు లేదని చాటి చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలిలో తమ్ముళ్ళు ఈ విధంగా టీడీపీ హై కమాండ్ మీద విరుచుకుని పడ్డారు.
ఎలమంచిలి టికెట్ ని జనసేనకు కేటాయిస్తున్నారు అన్న సమాచారం అందడంతో తమ్ముళ్ళు ఒక్కసారిగా మండిపోయారు.నియోజకవర్గంలోని పార్టీ ఆఫీసుకు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలు టీడీపీ ఇంచార్జి ప్రగడ నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వకపోతే అసలు ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ కోసం అయిదేళ్ళుగా కష్టపడుతూంటే జనసేనకు టికెట్ ఇస్తారా అని ఫైర్ అయ్యారు.
ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు.లేకపోతే మొత్తం ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ నేతలు అంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.ఎలమంచిలికి చెందిన మాజీ ఎంపీ పప్పల చలపతిరావు కూడా అధిష్టానం నిర్ణయం మీద ఆగ్రహంగా ఉన్నారు. ఆయన కూడా రాజీనామాకు సిద్ధపడ్దారు.
ఎలమంచిలి టికెట్ ని జనసేన నేత అయిన సుందరపు విజయకుమార్ కి ఇవ్వడానికి పొత్తులలో భాగంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. సుందరపు విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితులు. దాంతో మొదటి నుంచి ఈ సీటు జనసేనదే అని ఆ పార్టీ ఫిక్స్ అయింది. అయితే ఇక్కడ టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఆ పార్టీ గతంలో అనేక సార్లు గెలిచిన సీటు. ఒక విధంగా కంచు కోట అని చెప్పాలి.
అలాంటి సీటుని జనసేనకు ఇస్తే ఆ పార్టీ పల్లకీ మోత మేము మోయాలా అని తమ్ముళ్ళు నిగ్గదీస్తున్నారు. ఎలమంచిలి వాళ్ళం మంచివాళ్ళమే కానీ తేడా వస్తే చెడ్డవాళ్ళమని కూడా చెబుతున్నారు. టీడీపీకి ఈ సీటు ఇపుడు తలకాయనొప్పిగా మారింది. జనసేనకు సీటు ఇచ్చినా తమ్ముళ్ళు హెల్ప్ చేసే చాన్స్ ఉండదని అంటున్నారు.