బీజేపీ పాపాలకు బాబే జవాబు చెప్పాలి!

ఏపీకి బీజేపీ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు, విభజన హామీలను తుంగలోకి తొక్కి ప్రత్యేక హోదాను మడతేసి మూలన పెట్టి పోలవరం రాజధాని సహా కీలక విషయాలు అన్నీ కూడా పూర్తిగా పక్కన…

ఏపీకి బీజేపీ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు, విభజన హామీలను తుంగలోకి తొక్కి ప్రత్యేక హోదాను మడతేసి మూలన పెట్టి పోలవరం రాజధాని సహా కీలక విషయాలు అన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేసిన బీజేపీ మీద జనాగ్రహం తీవ్రంగా ఉంది. దానితో పాటు కొత్తగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ఉత్తరాంధ్ర జనాలు బీజేపీ మీద మంటెక్కి ఉన్నారు.

బీజేపీ ఈ విధంగా ఏపీలో జవాబు చెప్పుకోవాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వాటికి పొత్తు పార్టీగా ఏపీలో టీడీపీ కూటమి పెద్దన్నగా చంద్రబాబే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఏమి చెబుతారు బాబూ అని విశాఖకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ సూటిగానే నిలదీశారు.

అదే విధంగా ప్రత్యేక హోదా విభజన అంశాల మీద బాబు జనాలకు జవాబు చెప్పగలరా అని ఆయన అడుగుతున్నారు. బీజేపీతో వైసీపీకి అక్రమ బంధం ఉందని చెబుతూ ఇన్నాళ్ళూ ప్రత్యేక హోదా సహా అనేక అంశాల మీద కేవలం జగన్ మీదనే విమర్శలు చేస్తూ వచ్చిన బాబు ఇపుడు బీజేపీని మిత్రుడిగా చేసుకున్నారని ఏపీలో విభజన కష్టాలకు బీజేపీ తరఫున ఆయనే సమాధానలు చెప్పాల్సి ఉంటుందని మంత్రి అన్నారు.

ఒంటరిగా వెళ్తే ఏమవుతుందో బాబుకు తెలుసు అని అందుకే ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అంటూ బీజేపీతో పొత్తుల కోసం ఆయన వెంపర్లాడారని గుడివాడ ఎద్దేవా చేశారు. ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లిన దారుణ పరిస్థితి టీడీపీది అయిందని అన్నారు. వైసీపీకి ప్రజలు పొత్తు తప్ప ఏ ఒక్క పార్టీతోనూ లేనే లేదని అన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా అంతిమ విజయం వైసీపీదే అన్నారు.

వృద్ధాప్య దశలో ఉన్న చంద్రబాబుకు చేతి కర్ర ఎంత అవసరమో రాజకీయంగా కూడా ఊతం  అంతే అవసరం అని మంత్రి సెటైర్లు వేశారు. రాష్ట్రంలో కాపులు వైసీపీకి పూర్తి మద్దతుగా నిలుస్తారు అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గడచిన ఎన్నికల్లో 175 సీట్లలో 31 సీట్లను కాపులకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అందులో 29 మంది గెలిచారని, వారిలో చాలామందికి ఉన్నతమైన పదవులు జగన్  ఇచ్చారని గుర్తు చేశారు.

అలాగే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపు సంక్షేమానికి 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన చెప్పారు. కాపులకు జగన్మోహన్ రెడ్డి చేసినంత మేలు మరే ఇతర రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ చేయలేదని తెలియజేశారు. ఈ విషయాలు అన్నీ కాపు సామాజిక వర్గానికి తెలుసు అని మంత్రి స్పష్టం చేశారు