టార్గెట్ ఉత్తరాంధ్ర… వైసీపీ కొత్త వ్యూహం!

ఉత్తరాంధ్రను పొలిటికల్ గా వైసీపీ టార్గెట్ చేస్తోంది. తమకు 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన ఉమ్మడి మూడు జిల్లాలలో మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని వైసీపీ పట్టుదలతో ముందుకు సాగుతోంది.…

ఉత్తరాంధ్రను పొలిటికల్ గా వైసీపీ టార్గెట్ చేస్తోంది. తమకు 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన ఉమ్మడి మూడు జిల్లాలలో మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని వైసీపీ పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టిన అధికార పార్టీ అన్ని జిల్లాల నుంచి వైసీపీ అసెంబ్లీ ఇంచార్జిలు రీజనల్ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో కీలక సమావేశాన్ని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించింది.

ఉత్తరాంధ్రలో రాజకీయ పరిస్థితులను ఈ సందర్భంగా తెలుసుకున్న వైసీపీ అధినాయకత్వం వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం మీద దిశా నిర్దేశం చేసింది. పోల్ మేనేజ్మెంట్ నుంచి ప్రచారం వరకూ ఎలా చేయాలన్న దాని మీద డైరెక్షన్ ఇచ్చింది. ఉత్తరాంధ్రాలో 34 అసెంబ్లీ అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. వీటిలో తొంబై శాతం పైగా గెలుచుకుని తీరాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది.

వివిధ నియోజకవర్గాలలో అధికార పార్టీ బలాబలాలు ప్రత్యర్ధి పార్టీల బలాలు ప్లస్ మైనస్ వంటివి చర్చించారు. అభ్యర్ధులు ప్రచారంలో లేవనెత్తాల్సిన అంశాలను కూడా వివరించారు. రానున్న రోజులలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్నికల ప్రచార సభలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఆ సభకు ఎక్కడెక్కడ నిర్వహించాలి. ఏఏ అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహిస్తే ప్రభావం ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది.

దాదాపుగా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ అభ్యర్ధులు ఖరారు అయిపోయారు. ప్రచారంలోకి వారు దిగిపోయారు. ఇపుడు వారికి దిశా నిర్దేశం చేయడంతో పాటు కూటమి నుంచి ఉమ్మడిగా వచ్చే రాజకీయ ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవాలన్న దాని మీదనే డైరెక్షన్ ఇచ్చారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ  రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఈ ప్రాంతీయ  వర్క్ షాప్ లో పాల్గొన్నారు.

ఈ మీటింగ్ ని బట్టి చూస్తే వైసీపీ ఉత్తరాంధ్ర మీద ఎంతలా ఆశలు పెట్టుకుందో ఎంతలా ఈ జిల్లాలను టార్గెట్ చేసిందో అర్ధం అవుతోంది అని అంటున్నారు. 2019 నాటి మ్యాజిక్ రిపీట్ చేయాలన్న వైసీపీ పట్టుదల దీని వెనక ఉంది అని అంటున్నారు. ఈసారి జగన్ ఎన్నికల సభలు సైతం ఉత్తరాంధ్రా జిల్లాలలో ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.