ఉన్నట్టుండి సడెన్ గా హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు అజిత్. అతడు సాధారణ పరీక్షల కోసమే హాస్పిటల్ కు వెళ్లాడని చాలామంది చెబుతున్నప్పటికీ, కోలీవుడ్ లో పుకార్లు మాత్రం ఆగలేదు. మరీ ముఖ్యంగా అజిత్ కు మెదడులో కణతి ఉందని, దాని శస్త్రచికిత్స కోసమే అతడు హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు ఊహాగానాలు చెలరేగాయి.
ఈ మొత్తం వ్యవహారంపై అజిత్ మేనేజర్ స్పందించాడు. అజిత్ మెదడులో కణతి ఉందంటూ వస్తున్న పుకార్లను ఖండించాడు. మరి 2 రోజులుగా అజిత్, హాస్పిటల్ లో ఉండాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చాడు.
రెగ్యులర్ చెకప్ లో భాగంగా అజిత్ చెవి వెనక ఉన్న ఓ నరం వాచినట్టు వైద్యులు గుర్తించారు. చెవి నుంచి మెదడుకు వెళ్లే ఆ నరాన్ని సరిచేయాలని సూచించారు. దీంతో అజిత్ హాస్పిటల్ లో ఉన్నాడని, అతి చిన్న సర్జరీ చేసి, ఆ నరాన్ని సెట్ చేసి, అజిత్ ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు షిఫ్ట్ చేసినట్టు ప్రకటించారు.
అంతేకాదు, ఈరోజు అజిత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి, తన ఇంటికి కూడా చేరుకున్నాడు. మరో 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకొని, 18వ తేదీ నుంచి తన సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు. దీంతో 2 రోజులుగా అజిత్ పై వినిపిస్తున్న పుకార్లకు తెరపడింది.