తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్-డీఎంకే కూటమితో చేతులు కలిపారు కమల్. ఈరోజు ఎన్నికలపై విస్పష్ట ప్రకటన చేశారు. ‘‘నేను, నా పార్టీ (మక్కల్ నీది మయ్యమ్) ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ కూటమికి అన్ని విధాలా సహకరిస్తాం. ఇది పదవి కోసమే కాదు.. దేశం కోసం” అంటూ ప్రకటన ఇచ్చుకున్నారు కమల్.
తాజా ఒప్పందం ప్రకారం, తమిళనాట ఏ ఒక్క లోక్ సభ స్థానంలో కమల్ పార్టీ పోటీ చేయదు. పైగా కూటమి కోసం పాండిచ్చేరితో పాటు, తమిళనాడులోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కమల్ స్వయంగా ప్రచారం చేస్తారు. దీనికి ప్రతిగా వచ్చే ఏడాది రాజ్యసభ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీకి ఓ సీటు కేటాయించింది కూటమి.
ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, ప్రచారంతో బిజీగా ఉండబోతున్నారు కమల్. దీంతో ఆయన సినిమాలు ఆలస్యం కానున్నాయి. అయితే ఇండియన్-2 సినిమాను మాత్రం ఆయన సకాలంలో పూర్తిచేస్తారు. ఆ సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకుల్లేవు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హీరోగా నటిస్తున్న సినిమాతో పాటు, ఆయన నిర్మాణంలో తెరకెక్కుతున్న 2 సినిమాలు మాత్రం ఆలస్యం కానున్నాయి.