బీజేపీతో టీడీపీ పొత్తుపై ఇంకా అధికారిక ప్రకటన రాకుండానే విమర్శలు మొదలయ్యాయి. బీజేపీని సిద్ధాంతపరంగా వామపక్ష పార్టీలు తీవ్రంగా విభేదిస్తాయి. ఏపీలో వామపక్షాలకు బలంగా లేకపోయినప్పటికీ, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ, ఏపీకి చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడంలో సీపీఐ, సీపీఎం ముందు వరుసలో వుంటాయి. నిజానికి చంద్రబాబుతో సీపీఐకి మంచి స్నేహ సంబంధాలున్నాయి. చంద్రబాబుతో సీపీఎంకి అంతంత మాత్రమే రాజకీయ సంబంధాలున్నాయి.
బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో సీపీఎం అప్పుడే తూర్పార పట్టడం మొదలు పెట్టింది. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో టీడీపీ పొత్తును ప్రజలు తిరస్కరిస్తారన్నారు. ఎన్నికల అనంతరం ఆ పార్టీలు అడ్రస్ వెతుక్కోవాల్సి వుంటుందని ఆయన హెచ్చరించడం గమనార్హం.
బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం విశ్వాసఘాతుకమని ఆయన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే రాష్ట్రానికి వెన్నుపోటు పొడవడమని ఆయన అభివర్ణించారు. బీజేపీకి గెలుస్తామన్న నమ్మకం లేదన్నారు. అందుకే జాతీయ స్థాయిలో పొత్తుల కోసం బీజేపీ వెంపర్లాడుతోందని ఆయన విమర్శించారు.
టీడీపీతో పొత్తుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించాల్సి వుంది. ఎందుకంటే చంద్రబాబు అంటే రామకృష్ణకు వల్లమాలిన ప్రేమ. బీజేపీతో బాబు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రామకృష్ణకు వ్యక్తిగత సంబంధాలు ముఖ్యమా? లేక సిద్ధాంతమా? అనేది తేలాల్సి వుంది. ఇకపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలను వామపక్ష పార్టీలు ఏకిపారేయడం ఖాయం. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే తిరిగి జగనే ముఖ్యమంత్రి అవుతారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.