ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేనాని పవన్‌కల్యాణ్ ఒంటికాలిపై లేస్తూ వుంటారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పవన్ మాత్రం శత్రువుగా చూస్తుంటారు. తాజాగా కౌలురైతు భరోసా యాత్ర పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
ఇదిలా వుండగా పవన్‌కల్యాణ్‌కు కొత్త మొగుడు దొరికారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేనానిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో పంచ్‌లు, వ్యక్తిగత విమర్శలు కూడా ఉన్నాయి. పవన్‌కు గుడివాడ అమర్నాథ్ కొరకరాని కొయ్యగా తయారయ్యారు.
సీఎం జగన్‌పై, ఆయన ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్ ఒక మాట అంటే, ఆయనపై వంద మాటలు అనేందుకు గుడివాడ అమర్నాథ్ సిద్ధంగా ఉన్నారు. నాడు చంద్రబాబు హయాంలో రైతులకు రూ.87వేల కోట్ల రుణాలను రద్దు చేస్తానని, మాట తప్పిన చంద్ర బాబును పవన్‌కల్యాణ్ ఎందుకు నిలదీయలేదని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.
ఇది సరిపోదా మీరు చంద్రబాబుకు దత్తపుత్రుడని చెప్పడానికి అంటూ అమర్నాథ్ నిలదీశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, ఆయన చెప్పిన ప్రాంతాలకు వెళుతున్నట్టు పవన్‌పై విమర్శలు గుప్పించారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతాంగానికి రైతు భరోసా కింద రూ.18-19 వేల కోట్లను అందించామన్నారు. సచివాలయం ఉన్న ప్రతి గ్రామంలో రైతుల కోసం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘన చరిత్ర తమ ప్రభుత్వానిది అన్నారు.
2014 నుంచి చంద్రబాబు ఆశయాల కోసం పవన్‌కల్యాణ్ పని చేస్తున్నారని విమర్శించారు. దత్తపుత్రుడికి చెందిన రాజకీయ పార్టీ ఆశయాలేంటో చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. జనసేన సిద్ధాంతాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ సిద్ధాంతమల్లా చంద్రబాబు ఆలోచనలు, ఆశయాల కోసం పని చేయడం తప్పితే, మరొకటి లేదని దెప్పి పొడిచారు. బాబు ఆశయాల కోసం, అలాగే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం తప్పితే, జనసేన ఎందుకోసం పని చేస్తున్నదో చెప్పాలని మంత్రి నిలదీశారు.
రాజకీయంగా చంద్రబాబు వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసన్నారు. ఏ రోజూ మాట మీద నిలబడే తత్వమే చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిలబెట్టుకున్న దాఖలాలు లేవన్నారు. ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తు పెట్టుకుంటారో తెలియని వ్యక్తిత్వం చంద్రబాబుది అని ధ్వజమెత్తారు. పవన్‌కల్యాణ్ గురించి చెప్పాల్సిన పనిలేదన్నారు. ముగ్గురు నలుగురు పెళ్లాలు…ఇది ఆయన వ్యక్తిత్వం అన్నారు. రాజకీయంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా వ్యక్తిత్వం లేని వ్యక్తి పవన్‌కల్యాణ్ అని ఘాటు విమర్శలు చేశారు.
ఇలాంటి నాయకుడి గురించి ఏం మాట్లాడ్తామని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల రాజకీయ, వ్యక్తిగత క్యారెక్టర్ల గురించి రాష్ట్ర ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదన్నారు. ఒక నాయకుడేమో ఎన్ని పార్టీలతోనైనా పొత్తు పెట్టుకోడానికి సిద్ధంగా ఉంటారని, మరొకరేమో బహుభార్యలున్న వ్యక్తి అని దెప్పి పొడిచారు.
పవన్ వ్యక్తిత్వం గురించి ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ ఏం చెప్పారో అందరికీ తెలుసన్నారు. పవన్‌కల్యాణ్‌పై ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే అధికార పార్టీ వ్యూహాత్మకంగా ఉసిగొల్పుతోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పగించిన బాధ్యతల కంటే, పవన్‌ను టార్గెట్ చేయడమే లక్ష్యంగా గుడివాడ అమర్నాథ్ వరుస ప్రెస్మీట్లు పెడుతున్నారనే చర్చకు తెరలేచింది.