మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భేటీ అయ్యారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన ముఖ్యనేతల భేటీ రకరకాల చర్చకు తెరలేచింది. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో లగడపాటి ముందే ప్రకటించినట్టు రాజకీయ సన్యాసం స్వీకరించారు.
ఏపీ విభజనను అడ్డుకునేందుకు లగడపాటి శక్తి వంచన లేకుండా పోరాడారు. ఒకదశలో లోక్‌సభలో సొంత పార్టీకి చెందిన ఎంపీల కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి కలకలం రేపారు. చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. లగడపాటి రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఆ తర్వాత తనకిష్టమైన ఎన్నికల సర్వేలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే 2019లో ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని సర్వే వివరాలు వెల్లడించారు.
ఒకవేళ తన సర్వే నిజం కాకపోతే, ఇకపై ఆ పనికి కూడా స్వస్తి పలుకుతానని తేల్చి చెప్పారు. చివరికి లగడపాటి సర్వే అట్టర్ ప్లాప్ అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడా కనిపించలేదు.
ఇవాళ ఉదయం ఒక్కసారిగా నందిగాంలో లగడపాటి, వసంత కృష్ణప్రసాద్ భేటీ అయ్యారనే వార్త విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లిన ఇద్దరు నేతలు కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఇద్దరి మధ్య రాజకీయ చర్చలేవీ జరగలేదని వసంత కృష్ణప్రసాద్ చెబుతున్నప్పటికీ, మరోవైపు లగడపాటి కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై కీలక చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది.
విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు అధికార పార్టీకి బలమైన అభ్యర్థి అవసరం. కమ్మసామాజిక వర్గానికి చెందిన నేత కోసం వైసీపీ అధిష్టానం అన్వేషిస్తున్నట్టు సమాచారం. లగడపాటి కుమారుడే ఆ అభ్యర్థి కావచ్చేమో అనే చర్చ జరుగుతోంది.