జగన్ ఎదుట మంత్రి సంచలన ప్రకటన!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎదురుగానే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని మంత్రి సంచలన ప్రకటన చేశారు. అనకాపల్లి జిల్లా పర్యటనకు జగన్ గురువారం వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎదురుగానే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని మంత్రి సంచలన ప్రకటన చేశారు. అనకాపల్లి జిల్లా పర్యటనకు జగన్ గురువారం వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మరోసారి ఏపీకి జగన్ సీఎం కావడం చారిత్రక అవసరం అన్నారు.

ఈ విషయంలో తన వంతుగా తాను ఏమి చేయమన్నా చేస్తాను అని పేర్కొన్నారు. తనకు సీటు లేదని పోటీ చేయను అని రకరకాలుగా మీడియాలో ప్రచారం చేస్తున్నారు, ప్రత్యర్ధులు అయితే రాజకీయంగా విమర్శలు చేస్తున్నారని గుడివాడ అన్నారు. వారందరికీ సభా ముఖంగానే ఇదే నా జవాబు అని ఆయన చెప్పారు.

నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. అంతే కాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు పర్యటించి పదిహేను అసెంబ్లీ మూడు పార్లమెంట్ సీట్లను వైసీపీకి గెలిపించుకుని వస్తాను అని గుడివాడ చెప్పారు. తనకు ఉమ్మడి విశాఖ జిల్లాకు వైసీపీ తరఫున డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు అని ఆయన చెప్పారు.

వైసీపీ విజయంలోనే తన విజయం ఉందని గుడివాడ అన్నారు. జగన్ ని ఎదుర్కోవడానికి ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి అయ్యాయని, అయితే ఆయన్ని ఓడించడం వీరి తరం కాదని గుడివాడ సెటైర్లు వేశారు. జగన్ని ఓడించాలీ అంటే అవతల వైపు కూడా జగన్ లాంటి సమర్ధ నేత ఉండాలని ఆయన విపక్షానికి చురకలు అంటించారు. జగన్ కి భయమంటే తెలియదు అది ఆయన రక్తంలోనే లేదని గుడివాడ అన్నారు.

గుడివాడ జగన్ ఎదురుగానే ఈ ప్రకటన చేయడంతో ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేయరా అన్నది అనుచరులలో కలుగుతున్న సందేహం. మాటకారి అయిన గుడివాడ సేవలను ఎన్నికల ప్రచారం కోసం పార్టీ ఉపయోగించుకోవాలని చూస్తోందని అందుకే ఆయనకు టికెట్ ఇవ్వకుండా పార్టీ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన గుడివాడ వైసీపీ తరఫున ప్రచారం చేసి పార్టీకి ఉత్తేజం కలిగిస్తారు అన్న ఉద్దేశ్యంతోనే ఆయనని ఎన్నికల ప్రక్రియ నుంచి పక్కన పెట్టారని అంటున్నారు.