టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తుల కోసం ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వంతో పొత్తుల మీద చర్చలు జరిపి ఎన్డీయేలో చేరుతారు అని అంటున్నారు. చంద్రబాబు బీజేపీతో చేతులు కలపడం పట్ల వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి.
కొత్తగా జై భారత నేషనల్ పార్టీ పెట్టిన వీవీ లక్ష్మీనారాయణ అయితే బీజేపీకి కొన్ని కండిషన్లు పెట్టి మరీ పొత్తులో చేరాలని బాబుకు సూచిస్తున్నారు. అంతేకాదు ఏపీకి సంబంధించి విభజన హామీల మీద కేంద్ర ప్రభుత్వంలో బీజేపీలో పెద్దగా ఉన్న అమిత్ షా నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు అంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న అన్ని రకాల హామీలను బీజేపీ తప్పకుండా నెరవేరుస్తుందని హామీలను బాబు బీజేపీ నుంచి పొందాలని ఆయన కోరుతున్నారు. అంతే కాదు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను తక్షణం ఉపసంహరించుకోవాలని బాబు డిమాండ్ పెట్టాలని, విశాఖ రైల్వే జోన్ ని ఏర్పాటు చేసేలా కచ్చితమైన హామీ తీసుకోవాలని అన్నారు.
ఏపీకి సంబంధించి ప్రయోజనాల కోసం బాబు ఈ కండిషన్లు బీజేపీ పెద్దల ముందు పెట్టి వారి నుంచి హామీని పొందితేనే బాబు చెప్పినట్లుగా ఈ పొత్తు ఏపీకి న్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు. లక్ష్మీనారాయణ ఈ విధంగా బాబుని డిమాండ్ చేశారు కానీ అది సాధ్యమా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.
బీజేపీతో పొత్తుకు టీడీపీ ఉత్సాహ పడుతున్న సన్నివేశమే కనిపిస్తోందని బీజేపీ వద్దకు టీడీపీ అధినేత నేల తేడాలో రెండు సార్లు వెళ్లారని అంటున్నారు. అందువల్ల బేషరతుగానే బీజేపీతో పొత్తులు ఉంటాయి తప్ప లిఖితపూర్వకమైన హామీలు బీజేపీ పెద్దలు ఎందుకు ఇస్తారని అంటున్న వారు ఉన్నారు.
బీజేపీకి కండిషన్లు పెట్టడం కంటే కామెడీ వేరొకటి ఉండదని అంటున్నారు. టీడీపీ నేతలు మాత్రం బీజేపీతో పొత్తు రాష్ట్ర ప్రయోజనాలకే అని ఊదరగొడుతున్నారు. జనాలు వీటిని నమ్ముతారా అంటే ఎన్నికల ఫలితాలు బట్టి చూడాల్సి ఉంటుంది.