కాంగ్రెస్ అగ్ర నేతలలో టి. సుబ్బరామిరెడ్డి ఒకరు. ఆయనది విశాఖతో అనుబంధం నాలుగు దశాబ్దాల నాటిది. విశాఖ నుంచి లోక్ సభకు 1996, 1998లలో రెండు సార్లు ఆయన గెలిచారు. రెండు సార్లూ కలిపి మూడేళ్ళు మాత్రమే ఉన్నారు. రెండు సార్లు ఎన్నికలు రావడంతో ఆయన అయిదేళ్ల ఎంపీ గా పనిచేయలేకపోయారు.
ఆ లోటు ఆయనకు ఎప్పుడూ ఉంది. 2002 తరువాత నుంచి ఆయన మూడు సార్లు ఎంపీగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2020 నుంచి ఆయన చట్ట సభలకు దూరంగా ఉంటున్నారు. టి. సుబ్బరామిరెడ్డి ఎక్కువగా హైదారాబాద్ కే పరిమితం అయ్యారు. ఆయన విశాఖ రావడం తగ్గించేశారు.
ఆయన పుట్టిన రోజున, మహా శివరాత్రి రోజున మాత్రం తప్పనిసరిగా విశాఖ వస్తున్నారు. ఈ నెల 8న మహా శివరాత్రిని పురస్కరించుకుని టీఎస్సార్ విశాఖకు వచ్చారు. ఆయన విశాఖ బీచ్ లో మహా కుంభాభిషేకంలో పాల్గొంటారు. రోజంతా ఉపవాసం జాగారం తో ఆయన ఉంటారు. ఈసారి టీఎస్సార్ విశాఖ పర్యటన మహా శివుడి కోసమే అంటున్నారు.
ఈ పర్యటనలో మొదటి రోజు అంతా ఆధ్యాత్మికానికి కేటాయిస్తున్నారు. ఆయన రాజకీయంగా ఏమైనా ప్రకటనలు చేస్తారా అని మీడియాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆసక్తిగా చూస్తోంది. ఆయనను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు. ఈ నెల 11న విశాఖలో కాంగ్రెస్ భారీ సభ జరుగుతోంది. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి విశాఖ సభకు అటెండ్ అవుతున్నారు.
టీఎస్సార్ కూడా విశాఖలో ఉండి ఈ సభకు హాజరు అవుతారు అని అంటున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తారా లేదా అన్నది ఆ సభతో తేలుతుంది అని అంటున్నారు. ఎనభయ్యవ పడిలో పడిన టీఎస్సార్ కి ప్రత్యక్ష ఎన్నికల మీద ఆసక్తి లేదని చెబుతున్న వారు ఉన్నారు. అయితే కాంగ్రెస్ హై కమాండ్ వత్తిడి తెస్తే ఆయన పోటీలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయన పోటీలో ఉంటే విశాఖ ఎంపీ సీటులో కాంగ్రెస్ ఎంతో కొంత పోటీ ఇవ్వగలదని అంటున్నారు. ఈ పర్యటనలో టీఎస్సార్ మనసులో ఉద్దేశ్యం ఏమిటి అన్నది తెలుస్తుంది అని అంటున్నారు.