వర్మ ఏం చేసినా అంతా వెరైటీ. వ్యూహం సినిమాను తీసిన ఈ దర్శకుడు.. ఆ సినిమా అన్-కట్ వెర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేస్తాడని అంతా భావించారు. కానీ ఆర్జీవీ మాత్రం అంతకుమించి ఊహించాడు. వ్యూహం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసిన ఈ డైరక్టర్, ఆ సినిమాకు సంబంధించి శపథంను వెబ్ సిరీస్ రూపంలో ఓటీటీలో వదుల్తున్నాడు.
“వ్యూహం, శపథం సినిమాలు చేస్తున్నప్పుడే వాటికి వెబ్ సిరీస్ కూడా తీశాం. కొన్ని నిబంధనలు, కోర్టు కేసులు, అభ్యంతరాలు ఉంటాయి కాబట్టి, వాటికి తగ్గట్టు వ్యూహం ను థియేటర్లలో రిలీజ్ చేశాం. అదే సినిమాను వెబ్ సిరీస్ రూపంలో, ఎలాంటి కట్స్ లేకుండా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ లో ఈరోజు రాత్రి నుంచి అందుబాటులోకి వస్తుంది.”
వెబ్ సిరీస్ కు శపథం ఆరంభం ఛాప్టర్-1, శపథం ఆరంభం ఛాప్టర్-2 అనే టైటిల్స్ పెట్టాడు వర్మ. వీటిలో ఛాప్టర్-2 ఈ రాత్రికి ఏపీ ఫైబర్ నెట్ లోకి వస్తుంది. రేపు ఇదే టైమ్ కు ఛాప్టర్-2 కూడా అందుబాటులోకి వస్తుంది. థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది, అస్సలు డబ్బులు రాలేదు. కానీ తమ లక్ష్యం డబ్బు కాదని స్పష్టం చేశాడు వర్మ.
“డబ్బుల కోసం తీసిన సినిమా కాదిది. డబ్బు కావాలంటే మసాలా సినిమా తీసి ఉండేవాడ్ని. వ్యూహం-శపథం తీయడానికి కారణం ఏంటంటే.. నిజజీవితంలో మన కళ్ల ముందు కనిపిస్తున్న కొంతమంది రాజకీయ నాయకుల నిజస్వరూపాల్ని బట్టబయలు చేయడం మా టార్గెట్. కాబట్టి ఈ సినిమాను ఎక్కువమంది ప్రజలు చూసేలా చేయడం మా లక్ష్యం. అందుకే ముందుగా థియేటర్లలో రిలీజ్ చేశాం. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ లో వెబ్ సిరీస్ రూపంలో రిలీజ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇతర ఓటీటీ వేదికలపై కూడా ఈ సినిమా రావొచ్చు.”
శపథం ఆరంభం ఛాప్టర్-1, శపథం ఆరంభం ఛాప్టర్-2 టైటిల్స్ తో వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తున్నాడంటే. ఇక శపథం సినిమా థియేటర్లలోకి రాదనే అనుకోవాలి. దీనిపై మాత్రం వర్మ స్పష్టత ఇవ్వలేదు.