జగన్ ముద్దు.. ఆ ఎమ్మెల్యే వద్దు!

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి కంచుకోట లాంటి అసెంబ్లీ నియోజకవర్గం పాతపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వద్దు అంటూ సొంత పార్టీలోనే నినదిస్తున్నారు. జగన్ అంటే ముద్దు ఆ ఎమ్మెల్యే మాత్రం వద్దు అని అంటున్నారు. రెడ్డి…

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి కంచుకోట లాంటి అసెంబ్లీ నియోజకవర్గం పాతపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వద్దు అంటూ సొంత పార్టీలోనే నినదిస్తున్నారు. జగన్ అంటే ముద్దు ఆ ఎమ్మెల్యే మాత్రం వద్దు అని అంటున్నారు. రెడ్డి శాంతి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి 15 వేల పైబడి మెజారిటీతో గెలిచారు. దాని కంటే ముందు 2014లో కలమట రమణమూర్తి వైసీపీ నుంచి గెలిచారు. ఆ తరువాత ఆయన టీడీపీలోకి వెళ్ళిపోవడంతో రెడ్డి శాంతికి టికెట్ ఇచ్చారు.

ఈసారి కూడా ఆమెకే టికెట్ అని వినిపిస్తున్న నేపధ్యంలో ఆమె వద్దు అంటోంది సొంత పార్టీలో ప్రత్యర్థి వర్గం. ఆమె పట్ల నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఆమె నియోజకవర్గంలో అయిదేళ్ళూ లేరని నాన్ లోకల్ గా ముద్ర పడ్డారని అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో జెడ్పీటీసీలు అన్నీ వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంటే పాతపట్నంలో ఒక జెడ్పీటీసీ టీడీపీ గెలుచుకుందని దానికి కారణం ఎమ్మెల్యే నిర్వాకం అని ఆరోపిస్తున్నారు. హీరమండలం జెడ్పీటీసీ సీటుకు తన సొంత కుమారుడిని పెట్టి కూడా గెలిపించుకోలేని ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ వద్దు అనేస్తున్నారు.

ఆమెకు బదులుగా స్థానిక నేత జిల్లా పార్టీ కోశాధికారి లోతుగెడ్డ తులసి వరప్రసాదరావుకు టికెట్ ఇస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుని వస్తామని స్పష్టం చేస్తున్నారు. పాతపట్నం అసెంబ్లీ చరిత్ర చూస్తే కలమట కుటుంబం ఎక్కువ సార్లు గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ కి కూడా పట్టుంది. ఆ ఓట్లు అన్నీ వైసీపీకి మళ్ళడంతో 2014 నుంచి ఆ పార్టీ గెలుస్తోంది.

ఈసారి పాతపట్నంలో కొత్త ముఖానికి అవకాశం ఇస్తే గెలుపు ఖాయమని పార్టీలో ఒక వర్గం అంటోంది. వైసీపీ జిల్లా పెద్దలు అయితే ఇంకా అభ్యర్థి విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. వైసీపీలో రెడ్డి శాంతి పట్ల అధినాయకత్వం తీసుకునే నిర్ణయం బట్టి పాతపట్నంలో వైసీపీ జాతకం ఆధారపడి ఉంటుందని అంటున్నారు.