శివరాత్రికి శివుడి సినిమాలు

పండగల్ని మిస్ చేసుకోరు టాలీవుడ్ హీరోలు. దాదాపు ప్రతి పండక్కి పెద్ద సినిమాలొస్తున్నాయి. అయితే ఆ సినిమాలకు, పండగలకు సంబంధం ఉండదు. తమది మాత్రం పండగ సినిమానే అని చెబుతుంటారు, అది వేరే సంగతి.…

పండగల్ని మిస్ చేసుకోరు టాలీవుడ్ హీరోలు. దాదాపు ప్రతి పండక్కి పెద్ద సినిమాలొస్తున్నాయి. అయితే ఆ సినిమాలకు, పండగలకు సంబంధం ఉండదు. తమది మాత్రం పండగ సినిమానే అని చెబుతుంటారు, అది వేరే సంగతి. ఇప్పుడు మేటర్ ఏంటంటే, తొలిసారి శివరాత్రి సందర్భంగా వస్తున్న సినిమాల్లో శివుడి ప్రస్తావన కనిపిస్తోంది.

గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. కన్నడ దర్శకుడు హర్ష, ఈ మూవీతో టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు శివుడికి కనెక్షన్ ఉంది. ఇందులో సెమీ ఫాంటసీ అంశాలున్నాయి, పైగా పరశురామక్షేత్రం అనే ప్రాంతం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా వస్తోంది. సినిమాలోని సెకెండ్ గెటప్ లో గోపీచంద్, శివభక్తుడిలా కనిపిస్తున్నాడు.

ఇక శివరాత్రికి వస్తున్న మరో సినిమా గామి. విశ్వక్ సేన్ నటించిన సినిమా ఇది. ఇందులో అఘోరాగా నటించాడు విశ్వక్ సేన్. అంతేకాదు, కాశీ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించారు. ఇందులో మైథలాజికల్ టచ్ ఉందో లేదో తెలియదు కానీ, శివుడి ప్రస్తావన మాత్రం ఉందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది.

ఇలా శివరాత్రికి వస్తున్న 2 సినిమాల్లో శివుని ప్రస్తావన ఉండడం కాకతాళీయం. వీటిలో శివరాత్రికి ఏది సరైన సినిమా అనే విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

ఈ సినిమాలతో పాటు, మలయాళం డబ్బింగ్ మూవీ ప్రేమలు అనే సినిమా కూడా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది. రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి, రికార్డ్ బ్రేక్, ఐ లవ్ బ్యాడ్ బాయ్స్, బాబు నంబర్ వన్ బుల్ షిట్ గయ్, బుల్లెట్ లాంటి సినిమాలు కూడా ఈ వారాంతం థియేటర్లలోకి వస్తున్నాయి. ఇన్ని సినిమాలున్నప్పటికీ అందరి చూపు మాత్రం గామి, భీమ సినిమాలపైనే ఉంది.