తెలుగుదేశం పార్టీ పండుగ తరువాత రిలీజ్ చేసే మొదటి జాబితాలో పాత ముఖాలే ఎక్కువగా ఉంటాయని ప్రచారం సాగుతోంది. ఇప్పటికి అనేకమార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న వారికే టీడీపీ మరో చాన్స్ ఇస్తుందని అంటున్నారు.
ఒక విధంగా చాలా చోట్ల జూనియర్లు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే టీడీపీ మాత్రం రిస్క్ తీసుకునే చాన్సెస్ తక్కువ అని అంటున్నారు. పాలకొండలో నిమ్మల జయక్రిష్ణకు ఈసారి కూడా టికెట్ ఇస్తారని అంటున్నారు. ఆయనకు 2014, 2019లలో టికెట్ ఇచ్చినా ఓడిపోయారు కాబట్టి తమ పేర్లు పరిశీలించమని ఔత్సాహికులు కోరుకుంటున్నారు.
పలాసలో గౌతు ఫ్యామిలీని కాదనే సీన్ లేదని అంటున్నారు. అక్కడ తమకు అవకాశం ఇవ్వాలని ఉత్సాహవంతులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో కె అప్పలనాయుడుకే టికెట్ దక్కుతుందని ప్రచారంలో ఉంది. అక్కడ కూడా టీడీపీలో మరో వర్గం ఉంది. తమకు టికెట్ ఇవ్వాలని ఆ వర్గం కోరుతోంది. 2014లో గెలిచిన అప్పలనాయుడు 2019లో ఓడారు. దాంతో కొత్త ముఖానికి చాన్స్ ఇవ్వరా అన్నది ఆశావహుల మాట.
ఎస్ కోటలో ఒక ఎన్నారై టికెట్ కోరుతున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి వైపే హై కమాండ్ ఉండే చాన్స్ ఉంది అంటున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో అనితకు టికెట్ కాకుండా తమకు ఇవ్వాలని మరో వర్గం కోరుతోంది. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే నాన్ లోకల్ కాబట్టి లోకల్ కి ఈసారి చాన్స్ ఇవ్వాలని అంటున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఫ్యామిలీ టీడీపీలో చేరి ఆశలు పెంచుకుంది. తొలి జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయో చూడాల్సి ఉందని అంటున్నారు.