చంద్రబాబునాయుడు నీతులు మాట్లాడితే జనం నమ్మాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీ పోరాటం చేస్తోందని ఆయన బీరాలు పలుకుతున్నారు. దొంగ ఓట్లపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్రాంతికి కుటుంబ సభ్యులతో ఆయన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్నారు. ముఖ్యంగా చంద్రగిరిలో భారీ సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారనేది టీడీపీ ఆరోపణ.
దొంగ ఓట్లను అరికట్టాలంటూ చంద్రగిరి టీడీపీ ఇన్చార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో ఇటీవల తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాని ఆత్మహత్యా యత్నం చేశారు. పులివర్తి నానిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారన్నారు. తిరుపతి, పీలేరు, సత్యవేడు, శ్రీకాళహస్తిలో దొంగ ఓట్లు చేర్చారని విమర్శించారు.
గతంలో సిద్ధిపేటలో హరీష్రావు, చార్మినార్లో ఎంఐఎం అభ్యర్థి, కుప్పంలో తనకు అత్యధిక మెజార్టీ వచ్చిందన్నారు. అలాంటి కుప్పంలో అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో భారీ సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేశారనే వైసీపీ విమర్శలపై ఆయన మండిపడ్డారు. అలాంటివి వుంటే ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలే తప్ప, అధికార పార్టీ నేతల జోక్యం ఏంటని ప్రశ్నించారు. తానెప్పుడూ నామినేషన్ వేయడానికి కూడా వచ్చే వాడిని కాదన్నారు.
కుప్పానికి సమీపంలోని కర్నాటక ఓటర్లను చేర్చి, భారీ మెజార్టీతో గెలుపొందుతూ వచ్చాడని వైసీపీ ఆరోపణలు చేయడమే కాదు, ఆధారాలతో సహా బయట పెట్టింది. చాలా వరకూ కుప్పంలో దొంగ ఓట్లను తొలగించారు. మరికొన్ని వున్నాయని, వాటిని కూడా తొలగిస్తే బాబు సత్తా ఏంటో బయట పడుతుందని వైసీపీ అంటోంది.
కుప్పంలో దొంగ ఓట్లను తొలగిస్తుండడం, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుప్పంపై బాబు ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి రెండు నెలలకూ మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. తనను కుప్పంలో కట్టడి చేసే ప్రయత్నాలను బాబు ఓర్వలేకపోతున్నారు. అందుకే ఆయన వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.