మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. బాబు కేసుల భవిష్యత్‌కు సంబంధించిన తీర్పు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఈ పిటిషన్‌పై వాదనలు పూర్తయిన మూడు నెలల తర్వాత తీర్పు వెలువడుతుండడం గమనార్హం.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన్ను 50 రోజులకు పైగా ఉంచారు. మొదట ఆయనకు మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అసలు తనపై కేసు నమోదు చేయడమే అక్రమమని, దాన్ని రద్దు చేయాలంటూ బెయిల్ కోసం కాకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా తనపై ఏపీ సీఐడీ కేసు, అనంతరం అరెస్ట్ చేశారని , ఇది చెల్లుబాటు కాదనేది చంద్రబాబు వాదన.
అయితే 17ఎ తనకు వర్తించదని బాబు తరపు లాయర్లు చేసిన వాదనల్ని హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రోజుల తరబడి సీరియస్ వాదనలు జరిగాయి. చంద్రబాబు, ఏపీ సీఐడీ తరపున ఉద్ధండులైన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
అక్టోబర్ 17న సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది. అప్పటి నుంచి తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తీర్పు ఇతరుల కేసులకు కూడా వర్తించనుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పునకు విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెలువడనున్నట్టు సమాచారం. ఈ తీర్పు తనకు అనుకూలంగా వస్తే, తనంత నీతిపరుడే లేరని చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోడానికి వుంటుంది. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసు నమోదు చేసి జైల్లో ఉంచిందనే వాదనకు బలం చేకూరుతుంది. బాబుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం వైసీపీ పైచేయి సాధించినట్టు అవుతుంది.