విశాఖ ఎంపీ సీటుకు టీడీపీ తరఫున పోటీ చేయాలని బాలయ్య చిన్నల్లుడు గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్ చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నారు. ఆయన పెదబాబుతో పాటుగా చినబాబుని కూడా మచ్చిక చేసుకుంటున్నారు. 2019లో బాలయ్య ద్వారా టికెట్ కోసం సిఫార్సు చేయించుకున్న శ్రీభరత్ ఈసారి తన మార్గంలో తాను వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఆయన 2019లో స్వల్ప తేడాతో విశాఖ సీటుని కోల్పోయారు. ఈసారి తాను కచ్చితంగా గెలుస్తాను అని నమ్మకంగా ఉన్నారు. అయితే ఆయనకు టికెట్ దక్కినపుడే గెలుపు అన్న మాట ఉంటుంది. ముందు టికెట్ ఇస్తారా అన్న చర్చకు ఈసారి కూడా తెర లేస్తోంది.
దానికి కారణం బీజేపీతో పొత్తు ఓ వైపు కలవరపెడుతోంది. పొత్తు ఉంటే కనుక విశాఖ సీటుని బీజేపీకి సమర్పించుకోవాల్సి ఉంటుంది. పొత్తు లేకపోతే సీటు శ్రీభరత్ కి ఇస్తారా అంటే వైసీపీ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ దెబ్బేసేలా ఉందని అంటున్నారు. తాజాగా వైసీపీ విశాఖ ఎంపీ సీటు విషయంలో కొత్త ఇంచార్జిని నియమించింది. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మిని విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీలో నిలబెడతారు అన్నది స్పష్టం అవుతోంది.
ఆమె బీసీ మహిళ కావడంతో పాటు లోకల్ క్యాండిడేట్ కూడా అవడంతో టీడీపీ కూడా సామాజిక సమీకరణలను చూసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. టీడీపీ బీసీ క్యాండిడేట్ ని పోటీలో పెట్టడం అనివార్యం అవుతుంది అని అంటున్నారు. దాంతో శ్రీభరత్ కి ఎంపీ సీటు హుళక్కే అన్న మాట వినిపిస్తోంది.
తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీగానే పోటీ చేస్తాను అని శ్రీభరత్ అంటున్నారు. విశాఖలో ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి మరో కమ్మ అభ్యర్ధిగా వెలగపూడి రామక్రిష్ణ విశాఖ తూర్పు నుంచి ఉన్నారు. ఏ విధంగా చూసినా బాలయ్య చిన్నల్లుడి ఆశలు ఈసారి తీరేట్టు లేవా అన్న సంశయం అయితే ఆయన అనుచరులలో ఉందని అంటున్నారు.