వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో ఒక్కో నాయకుడిది ఒక్కో వర్గం. టీడీపీలో ఉన్నోళ్లు, లేనోళ్లు కూడా టికెట్ ఆశిస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో వున్న తనను కాదని, మరొకరికి టికెట్ ఇవ్వాలని అనుకుంటే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రొద్దుటూరు టీడీపీలో గొడవలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌ను ఇన్చార్జ్ జీవీ ప్రవీణ్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, సీఎం రమేశ్‌నాయుడు అన్న సీఎం సురేష్‌నాయుడు ఆశిస్తున్నారు. వీరిలో నంద్యాల వరదరాజులరెడ్డి, సురేష్‌నాయుడు కలిసి ముందుకు సాగుతున్నారు. మిగిలిన నేతలంతా ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా నడుచుకుంటున్నారు.
తనకే టికెట్ అని ప్రవీణ్ ధీమాగా ఉన్నారు. గతంలో ఒకట్రెండు సందర్భాల్లో ప్రవీణ్‌కే టికెట్ అన్నట్టుగా లోకేశ్ సంకేతాలు ఇచ్చారు. ఇటీవల విజయవాడలో లోకేశ్, చంద్రబాబులను ప్రవీణ్ కలిసినప్పుడు కూడా టికెట్‌పై క్లారిటీ ఇచ్చారని సమాచారం. మరోవైపు వరదరాజులరెడ్డి 80 ఏళ్ల వయసులోనూ ప్రతి వీధి తిరుగుతూ ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే గెలుచుకుని వస్తానని వరదరాజులరెడ్డి చెబుతున్నారు.
అసలు టీడీపీలో సభ్యుడే కాని వరదరాజులరెడ్డి పార్టీ టికెట్ తనకే అని ఎలా ప్రచారం చేసుకుంటారని లింగారెడ్డి ప్రశ్నించారు. టికెట్ తనకే అని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. వీళ్లెవరూ టీడీపీ కార్యకలాపాల్లో కలిసి పాల్గొనడం లేదు. ప్రవీణ్‌కు టికెట్ ఇస్తే ఇతరులెవరూ చేసే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే ఇతరులకు టికెట్ ఇస్తే… ప్రవీణ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.
టికెట్‌పై క్లారిటీ ఇవ్వకపోతే ప్రొద్దుటూరు టీడీపీలో విభేదాలు మరింత పెరిగి, పార్టీకి నష్టం వాటిల్లుతుందనే ఆందోళన శ్రేణుల్లో కనిపిస్తోంది.