Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఏంది సామీరంగా ఇది?

ఏంది సామీరంగా ఇది?

మ‌న ప‌ని మ‌నం క‌రెక్ట్‌గా చేస్తే డైలాగ్‌లు రాసుకోనక్క‌ర‌లేదు. క్యారెక్ట‌ర్లే మాట్లాడుతుంటాయి. మ‌నం రాసుకోవాలి. ఈ మాట క్వింటిన్ ట‌రాన్టినో అన్నాడు. ఆయ‌నెవ‌రు అని అడిగేవాళ్లు గూగుల్‌లో వెతుక్కోండి. ఈ వ్యాసం క్వింటిన్ గురించి కాదు. నా సామిరంగా సినిమా గురించి.

పెద్ద డైరెక్ట‌ర్లు, అందులోనూ హాలీవుడ్‌తో మొద‌లు పెడితే నాకూ సినిమా గురించి తెలుసు అని అంద‌రూ అనుకుంటార‌ని నా భ్ర‌మ‌. భ్ర‌మ‌, భ్రాంతి, అజ్ఞానం, మూర్ఖ‌త్వంతోనే ఈ ప్ర‌పంచం న‌డుస్తుంది. జ్ఞానం లేనే లేదు. అజ్ఞానాన్ని తెలుసుకోవ‌డ‌మే జ్ఞానం. నేను భ‌గ‌వ‌ద్గీత‌లోని జ్ఞాన యోగం గురించి మాట్లాడ్డం లేదు. సామిరంగా సినిమా గురించి చెప్ప‌డ‌మే నా ఉద్దేశం.

టరాన్టినోకి ప్ర‌పంచ‌మంతా శిష్యులున్నారు. హింస ఎక్కువున్నా ఏదో సీరియ‌స్ విష‌యం వుంటుంది. మ‌నిషిలోని చాలా షేడ్స్ వుంటాయి. అంత‌ర్లీనంగా హాస్యం వుంటుంది. అందుకే పెద్ద‌పెద్ద న‌టులు ట‌రాన్టినోతో ప‌నిచేస్తారు. అత‌నితో స‌మాన‌మైన వాడు తెలుగులో త‌రుణ్ భాస్క‌ర్ వున్నాడు. కాక‌పోతే నాణ్య‌మైన మ‌సాలా దినుసులు వెతికే క్ర‌మంలో చికెన్ మ‌రిచిపోయి బిర్యానీ వ‌డ్డిస్తాడు. ఎంత గొప్ప లైట్ అయినా లూజ్ క‌నెక్ష‌న్ వుంటే వెల‌గ‌దు. అన‌వ‌స‌రంగా క‌న్ను కొట్టి మ‌న క‌ళ్లు పోగొడుతుంది. కీడాకోలాలో కూల్ డ్రింక్‌లో బొద్దింక‌ని వేశాన‌నుకున్నాడు కానీ, ప్రేక్ష‌కుల్ని కూడా వేసి క‌థ‌ని ముందుకు పోకుండా చేశాడు. అందుకే జ‌నం థియేట‌ర్‌లో చూడ‌కుండా ఓటీటీలో చూసుకున్నారు. కీడాకోలా క్లైమాక్స్‌ మాత్రం ట‌రాన్టినో దగ్గ‌ర అప్పు తీసుకున్నాడు. వ‌డ్డీతో తీర్చాలంటే ఇంకో సినిమా తీయాలి.

సామీరంగా అనే పాయింట్ రాకుండా ఏందేందో చెబుతున్నాడ‌ని అనుకుంటున్నారా? నేను క‌రెక్ట్‌గానే ఉన్నా, మీరే క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. మ‌న సినిమాల్లో ఎక్కువ భాగం పాయింట్‌కి రాకుండా అన‌వ‌స‌ర సీన్స్‌తోనే వుంటాయి. దాంట్లో సామీరంగా కూడా ఒక‌టి.

పైసా ఖ‌ర్చు లేకుండా చ‌దివే వెబ్‌సైట్ వ్యాసంలోనే సోది చెబితే చిరాగ్గా ఉన్న‌ప్పుడు, వెయ్యి రూపాయ‌లు ఖర్చు పెట్టుకుని (టికెట్ + పాప్‌కార్న్ చెత్త‌+ క్యాబ్‌) సినిమాకి వెళ్లిన‌ప్పుడు పాయింట్‌కి రాకుండా సోది చూపిస్తే నాకెంత కోపం రావాలి?

నిన్నెవ‌డు చూడ‌మ‌న్నాడ‌ని మీరు అడ‌గొచ్చు. ఇంట‌ర్వ్యూల్లో సినిమాని అద‌ర‌గొట్టామ‌ని నాగార్జున అంతటోడు ఊద‌ర‌గొడితే నిజ‌మ‌ని న‌మ్మి వెళ్లాను. వాచీ పెట్టుకోక‌పోయినా టైమ్ బాగుండ‌ద‌ని నాకేం తెల్సు? సినిమా ప్రారంభంలో 1963 అని వేస్తే , సినిమా కూడా అప్ప‌టి సినిమాలానే తీశార‌ని ఎలా ఊహిస్తాం? పండుగ పూట పిండి వంట‌లు పెడ‌తార‌ని ఆశ పడితే పిండి మాత్ర‌మే పెడితే ఏం చేసేది?

ఇద్ద‌రు హీరోలు, ఇద్ద‌రు విల‌న్లు, ఒక పెద్దాయ‌న‌. హీరోని తురుమ్‌ఖాన్ అని వ‌ర్ణిస్తూ గ్రూప్ సాంగ్, రెండు డ్యూయెట్లు, నాలుగు ఫైట్లు, పెండ్లి, ఒక చావు వీట‌న్నిటి మ‌ధ్య క‌థ కూడా భ‌యంభ‌యంగా ఎక్క‌డో న‌క్కి వుంటుంది. ఇంతోటి దానికి మ‌ళ‌యాళం నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? ఏడు ఎక‌రాలు బ‌స్టాఫ్‌లో గ‌డ్డాలు పెంచుకుని, భుజానికి ఉన్న సంచిలో క‌థ‌లు వేసుకుని ర‌చ‌యిత‌లు తిరుగుతూ వుంటారు. గేట్ వ‌ర‌కూ రానిస్తే చాలు, ఊచ‌ల్లోంచి దూరి క‌థ‌లు లోప‌లికి వస్తాయి.

మ‌ళ‌యాళం వాళ్లు అంత తెలివి త‌క్కువ వాళ్లేమీ కాదు. వాళ్లు చ‌క్కెర పాక‌మే ఇచ్చి వుంటారు. మ‌న వాళ్లు ఉప్పు నీళ్లు క‌లిపి ఎందుకూ ప‌నికి రాకుండా చేయ‌గ‌ల‌రు. ఔట్‌డేటెడ్‌కి, అప్‌డేట్‌కి తేడా తెలియాలంటే ఏబీసీడీలు వ‌చ్చి వుండాలి.

సంక్రాంతిని క‌థ‌లో బ్యాక్‌డ్రాప్ పెట్టి, సంక్రాంతి రోజు రిలీజ్ చేస్తే సంక్రాంతి సినిమా అయిపోతుందా? పండుగ రోజు ప్రేక్ష‌కుల్ని తిన‌డం న్యాయ‌మా?

ఇంత‌కీ దీనికి నా సామిరంగా అని ఎందుకు పెట్టారంటే... అది హీరోకి ఊత ప‌దం. సినిమాల్లో ఓ డ‌జ‌ను సార్లు నా సామిరంగా అంటూ వుంటాడు. ఈ మాట‌కి అర్థం ఏమంటే, పాండురంగ మ‌హ‌త్యం క‌థ చ‌దువుకోవాల్సిందే. చ‌రిత్ర అడ‌క్కుండా చెప్పింది వినండి.

వెనుక‌టికి విచిత్ర కుటుంబం అని ఎన్టీఆర్ సినిమా వ‌చ్చింది. ఎన్టీఆర్ ఇంట్లో కూడా లాయ‌ర్ కోటుతో వుంటాడు. కుటుంబం వుంటుంది కానీ, విచిత్ర‌మే వుండ‌దు. టైటిల్ జస్టిఫికేష‌న్ కోసం చివ‌ర్లో ఒకాయ‌న మీది మ‌రీ విచిత్ర కుటుంబం అంటాడు. వెంట‌నే శుభం కార్డు.

మ‌ళ్లీ ట్రాక్ త‌ప్పుతోంది. నాగార్జున కూడా ట్రాక్ త‌ప్పి చాలా కాల‌మైంది. లుంగీ క‌ట్టి, బీడీ తాగుతూ, కొడ‌వ‌లి ప‌ట్టి క‌స‌క్ క‌స‌క్ అని సౌండ్ చేస్తే జ‌నం చూస్తార‌ని ఎందుకు అనుకున్నాడో? త్రివిక్ర‌మ్ ఇలాగే అనుకుని మ‌హేశ్‌బాబుతో బీడీ తాగించాడు... జ‌నాల‌కి ద‌గ్గు వ‌చ్చింది కానీ వినోదం రాలేదు. పప్ప‌ల పొడి చూపించి గుంటూరు కారం అన్నాడు. న‌మ్మినోళ్లు న‌మ్మారు. న‌మ్మని వాళ్లు కూడా చూశారు. స‌మీక్ష‌కుల‌కి సినిమా చూడ‌డం రాద‌న్నారు. మంచిదే. సినిమా చూడ‌డమే వ‌స్తే వాళ్లు స‌మీక్ష‌కులు ఎందుకు అవుతారు? క‌మండ‌లం తీసుకుని జీవితం మీద విరక్తితో హిమాల‌యాల‌కి వెళ్లిపోతారు.

సామిరంగా చైల్డ్ ఎపిసోడ్‌తో స్టార్ట్ అవుతుంది. అన్నద‌మ్ముల‌లాంటి ఇద్ద‌రు స్నేహితుల క‌థ అనుకుంటాం. కాసేప‌టికి నాజ‌ర్ వ‌స్తాడు. సింహాద్రి త‌ర‌హాలో హీరోకి, నాజర్‌కి మ‌ధ్య వున్న అనుబంధం మీద క‌థ అనుకుంటాం. చైల్డ్ హీరోయిన్ వ‌స్తుంది. ప్రేమ అనుకుంటాం.

హీరోయిన్ తండ్రి రావు ర‌మేశ్ కావ‌డంతో కాన్‌ఫ్లిక్ట్ గ‌ట్టిగానే వుండొచ్చు అనుకుంటాం (తండ్రికి మించిన న‌టుడు రావు ర‌మేశ్‌. ఎంత తుక్కు క్యారెక్ట‌ర్ ఇచ్చినా నూరు శాతం న్యాయం చేస్తాడు).

టైటిల్స్ త‌ర్వాత రాజ్ త‌రుణ్ ల‌వ్ స్టోరీ (పాపం రాజ్ త‌రుణ్‌, సైడ్ యాక్ట‌ర్‌కి ఎక్కువ‌, సైడ్ హీరోకి త‌క్కువ‌). క‌థ రెండు ఊళ్ల మ‌ధ్య ప్రేమ సంఘ‌ర్ష‌ణ అనుకుంటాం. నాగార్జున ఎంట‌రై ప‌క్క వూరి వాళ్ల‌ని కొడుతుంటే అల్ల‌రి న‌రేష్ కామెంట్రీ చెబుతూ వుంటాడు. ఇది కామెడీ అని మ‌నం అనుకోవాలి.

త‌ర్వాత సుదీర్ఘ‌మైన హీరో ల‌వ్ ప్లాష్ బ్యాక్‌. క‌థ ఎటు పోతూ వుందో అర్థం కాక‌, బుర్ర గోక్కుంటూ వాట్స‌ప్ చూసుకుంటూ వుంటే, ఉన్న‌ట్టుండి దుబాయ్ నుంచి కొత్త క్యారెక్ట‌ర్ ఊడిప‌డి, ప్ర‌భాస్ శీనుని కొబ్బ‌రి కాయ‌ల క‌త్తితో న‌రుకుతాడు. వీడెవ‌ర్రా సామి అనుకుంటుంటే నాగార్జున సైకిల్ చైన్ తీస్తాడు.

సినిమా ఎలా వుంద‌నేది కాదు కానీ, ఇంత పూర్ రైటింగ్, పురాత‌న సీన్స్‌, డైలాగ్స్ ఉన్న సినిమాని నాగార్జున ఎలా ఆమోదించారు? పైగా తాము అద్భుత‌మైన పండుగ సీనిమా తీశామ‌ని ప్ర‌మోష‌న్స్‌. నాగార్జున ఎలివేష‌న్‌, ఫైట్స్ వుంటే సినిమా ఆడేస్తుందా? సెట్‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు, మేక‌ప్‌, ప్రొడ‌క్ష‌న్‌, ఇలా ర‌క‌ర‌కాల రూపాల్లో భ‌జ‌న బృందాలుంటాయి. లుంగీ క‌ట్టి, బీడీ తాగి సైకిల్ చైన్ లాగితే ఇది శివ కంటే పెద్ద హిట్ అని చిడ‌త‌లు వాయించి వుంటారు. ఫ్యాన్స్ ఎగ‌బ‌డ‌తార‌ని చెబితే నాగార్జున న‌మ్మేసి వుంటాడు. పొగ‌డ్త‌ల‌కి ప‌డే వాళ్ల‌ని క‌దా హీరోలంటారు.

నాగార్జున‌కి తెలియ‌ని విష‌యం ఏమంటే ఆయ‌న అభిమానులంతా ముసలోళ్లు అయిపోయి, మ‌నుమ‌ళ్ల‌తో ఆడుకుంటూ కొంద‌రు, వృద్ధాశ్ర‌మాల్లో మ‌రికొంద‌రు వుండ‌గా పోయేవాళ్లు పోయారు. ఈ వ‌య‌సులో నాగార్జున ఫిట్‌గా వుంటే, ఆయ‌న అభిమానులు కూడా ఫిట్‌గా వుండ‌రు క‌దా!

ఫ్యాన్స్ అనేది ఒక 3D లాంటి భ్ర‌మ‌. అద్దాలు తీస్తే అంతా మ‌స‌కే. అమితాబ్ ఈ స‌త్యం గ్ర‌హించి వ‌య‌సుని, సినిమాని జ‌యించాడు. సామిరంగ‌లో కాసేపైనా కూర్చోగ‌ల‌మంటే అది కెమెరా మెన్ ప‌నిత‌నం, అల్ల‌రి న‌రేష్ న‌ట‌న‌.

జాత‌ర సెట్టింగ్‌లు, వేట కొడ‌వ‌ళ్లు, గ‌డ్డం పెంచుడుతో సినిమాలు ఆడ‌వు. ఎమోష‌న్స్‌తో ఆడుతాయి. అది లేకుండా ఎన్ని చేసినా శ‌వాన్ని అలంక‌రించిన‌ట్టే.

చెద‌లు తినేసిన స్క్రిప్ట్‌తో సినిమాలు తీసే బ‌దులు నాగార్జున హాయిగా టీవీ షోలు చేయ‌డం మేలు. దీని వ‌ల్ల రెండు లాభాలు. నాగార్జున‌కి డ‌బ్బులొస్తాయి, మాకు పోకుండా వుంటాయి.

ముగింపుః ఇంత‌కీ తెలుగు సినిమాల గురించి క్వింటిన్ ట‌రాన్టినో ఏమంటాడంటే, ఏమీ అన‌లేదు. ఆయ‌న తెలుగు సినిమాలు తీయ‌లేదు, చూడ‌డు. అందుకే హాలీవుడ్‌లో ఆరోగ్యంగా ఉన్నాడు.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?