సొంత నియోజక వర్గమైన చంద్రగిరిలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఓడించడానికి చంద్రబాబునాయుడు పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం చంద్రగిరి బరిలో చెవిరెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. అభ్యర్థి మోహిత్‌రెడ్డి అయినప్పటికీ, కర్త, కర్మ, క్రియా.. అన్నీ ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెవిరెడ్డిని ఎదుర్కోడానికి చంద్రబాబుకు దీటైన అభ్యర్థి దొరకడం లేదు.
చంద్రగిరి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లను బరిలో దింపాలని చంద్రబాబు ఉత్సాహం చూపినప్పటికీ, అటు వైపు నుంచి సరైన స్పందన రాలేదని తెలిసింది.
చంద్రగిరి టీడీపీ ఇన్చార్జ్గా పులవర్తి నాని వున్నారు. దొంగ ఓట్లపై ఆయన పోరాటం చేస్తున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పెరిగిన ఓట్లు చాలా స్వల్పమే అని, అలాంటప్పుడు దొంగ ఓట్లకు చోటు ఎక్కడ అని ఇటు రెవెన్యూ ఉన్నతాధికారులు, అటు వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. దొంగ ఓట్లపై టీడీపీ రాద్ధాంతం అంతా ప్రచారం కోసమే అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నెగ్గలేనని తెలిసే మూడు దశాబ్దాల క్రితం కుప్పానికి వలస వెళ్లారని, తనకు చేతకానిదాన్ని మరొకరి రూపంలోనైనా తీర్చుకోవాలని ఆయన తపిస్తున్నారనే విమర్శ లేకపోలేదు. 2014లో మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గల్లా అరుణకుమారిని చెవిరెడ్డి ఓడించి చట్టసభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించారు. 2019లో పులివర్తి నానిని బాబు బరిలో దింపారు.
నానిపై చెవిరెడ్డి మెజార్టీ 40 వేలు దాటింది. దీంతో చెవిరెడ్డిని ఎదుర్కోవడం ఈజీ కాదని చంద్రబాబుకు అర్థమైంది. ఒకవైపు పులివర్తి నాని ఇన్చార్జ్గా ఉన్నప్పటికీ, బలమైన ప్రత్యామ్నాయ నాయకుడి కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలోని కొందరు సంపన్నులను, అది కూడా రెడ్డి సామాజిక వర్గ నేతలతో చంద్రబాబు మాట్లాడినట్టు తెలిసింది.
చెవిరెడ్డిని ఎదుర్కోవడం ఆషామాషీ కాదని, మరో నియోజకవర్గం వుంటే చెప్పాలని బాబును సదరు వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు కోరినట్టు సమాచారం. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను నిలిపితే, అటు వారి ఓట్లు, ఇటు తన సామాజిక వర్గం ఓట్లు పడతాయని, తద్వారా గెలుపు సాధించొచ్చని బాబు వ్యూహం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెవిరెడ్డి మరింత బలపడ్డారు. దీంతో చెవిరెడ్డిని కట్టడి చేసే విషయమై బాబు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. చంద్రగిరిలో చెవిరెడ్డి కుటుంబాన్ని ఓడించాలన్న బాబు కోరిక నెరవేరుతుందా? అనేది చర్చనీయాంశమైంది.