తీవ్ర ఉత్కంఠ రేపిన చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించింది. దీంతో పిటిషన్‌పై విచారణ మళ్లీ మొదటికొచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయడం అన్యాయమంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే అరెస్ట్ చేశారని, అందువల్ల కేసు కొట్టేయాలని చంద్రబాబు మొదట హైకోర్టును ఆశ్రయించారు.
అయితే సెక్షన్ 17-ఎ అనేది అవినీతిని అరికట్టడానికే తప్ప, అవినీతిపరుల్ని కాపాడ్డానికి కాదంటూ ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు గట్టిగా వాదించారు. చంద్రబాబుకు 17ఎ వర్తించదని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాబు పిటిషన్‌పై జడ్జిలు అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో పేరెన్నికగన్న న్యాయవాదులను ఇరుపక్షాలు నియమించుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును రక్షించేందుకు రకరకాల వాదన్ని ఆయన తరపు న్యాయవాదులు తెరపైకి తెచ్చారు. ఇదే సందర్భంలో అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న చంద్రబాబుకు ఆ సెక్షన్ ఎలా వర్తించదో ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు దీటైన వాదనలు వినిపించారు.
తెలుగు సమాజం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తీర్పు ఎట్టకేలకు వెలువడింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు వెలువరించడం విశేషం. సెక్షన్ 17ఎ చంద్రబాబుకు వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు ఇవ్వగా, వర్తించదని జస్టిస్ బేలా త్రివేదీ తీర్పు ఇచ్చారు. దీంతో ఎటూ తేలకపోవడంతో త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలని ద్విసభ్య ధర్మాసనం నిర్ణయించింది. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.
సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పులు ఇవ్వడంతో వైసీపీ, టీడీపీ, జనసేన, ఇతర రాజకీయ పక్షాలు నోరు తెరవలేని పరిస్థితి. ఒకటేమో చంద్రబాబుకు, మరొక తీర్పు ఏపీ సీఐడీకి అనుకూలంగా ఉండడం, త్రిసభ్య ధర్మాసనానికి వెళుతుండడంతో ఇప్పట్లో కేసు తేలదనే చర్చకు తెరలేచింది.