సుప్రీంకోర్టు చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్‌పై కీలక తీర్పులు వెలువడ్డాయి. ఈ తీర్పులు ముఖ్యంగా టీడీపీకి నిరాశే మిగిల్చాయి. సెక్షన్ 17ఎ బాబుకు వర్తిస్తుందని ఒక న్యాయమూర్తి, వర్తించదని మరో న్యాయమూర్తి రెండు భిన్నమైన తీర్పులు చెప్పడంతో, త్రిసభ్య ధర్మాసనానికి వెళ్లాల్సి వచ్చింది. అయితే సెక్షన్ 17ఎ చంద్రబాబుకు వర్తిస్తుందనే తీర్పు ధర్మాసనం నుంచి వస్తుందని టీడీపీ ఆశించింది.
తద్వారా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయట పడతారని, ఇది ఎన్నికల వేళ రాజకీయంగా చాలా ఉపయోగ పడుతుందని టీడీపీ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. రెండు భిన్నమైన తీర్పులు వెలువడిన నేపథ్యంలో చంద్రబాబుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
చంద్రబాబు సారు సగం తుప్పు, సగం నిప్పు… ఎంత గొప్పో అంటూ సెటైర్స్ విసురుతున్నారు. ఇంతకూ న్యాయం గెలిచిందా, ఏమంటారు చంద్రబాబూ అనే నిలదీతలతో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా ధర్మాసనం తీర్పు వుండి వుంటే, ఈ పాటికే టీడీపీ ఓవరాక్షన్‌ను నిలువరించడం సాధ్యమయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండు భిన్నమైన తీర్పులను చూసి చంద్రబాబుకు నోట మాట వచ్చే పరిస్థితి లేదని చురకలు అంటిస్తున్నారు. నేరం చేయలేదని వాదించకుండా, ఎంత సేపూ సెక్షన్ 17ఎ చుట్టూ తిరిగారంటే, స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర అందరికీ తెలిసిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికింకా తాను నిప్పు అని బాబు వాదిస్తే, జనాలు నవ్విపోతారని గ్రహించాలని నెటిజన్లు హితవు చెప్పడం గమనార్హం.