ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రథసారథిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటించింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజుకు జాతీయ స్థాయిలో పదవి ఇచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపన కోసమంటూ షర్మిల వైఎస్సార్‌టీపీని స్థాపించారు. అయితే తెలంగాణ ప్రజాసమస్యలపై పోరాటాలు చేసినా షర్మిలను అక్కున చేర్చుకోలేదు. పాలేరు బరిలో నిలుస్తానని షర్మిల కొంత కాలం హడావుడి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒట్టు తీసి ఆమె గట్టు మీద పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఆమె బేషరతుగా మద్దతు ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. తెలంగాణలో తనకు రాజకీయ భవిష్యత్ లేదని షర్మిల గ్రహించారు. దీంతో తెలంగాణ కేంద్రంగా రాజకీయాలు చేయాలనే నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఎట్టకేలకు ఏఐసీసీ షరతులకు ఆమె అంగీకరించారు. ఏపీ కేంద్రంగా రాజకీయాలు చేయడానికి ముందుకొచ్చారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేశారు.
సార్వత్రిక ఎన్నికల ముంగిట ఆమెకు కీలక బాధ్యతల్ని కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికే ఇదే సరైన సమయమని ఆమెను ముందు పెట్టడం గమనార్హం. తనకు అప్పగించే పదవిని అనుసరించి, భవిష్యత్ కార్యాచరణ వుంటుందని ఇటీవల షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.
పీసీసీ అధ్యక్షు బాధ్యతల్ని అప్పగించిన నేపథ్యంలో ప్రత్యర్థులపై రాజకీయ దాడి చేయడానికి ఆమె వెనుకాడే పరిస్థితి వుండదు. తన సొంత అన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండడంపై పాలనా విధానాలపై షర్మిల స్పందన తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ వుంది. మరి షర్మిల ఏం మాట్లాడ్తారో!