విశాఖ, ఉత్తరాంధ్రపై చంద్రబాబు పగబట్టారా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో.. రాష్ట్రమంటే ఒక్క హైదరాబాదు మాత్రమే అన్నట్టుగా.. కేవలం ఆ ఒక్క నగరంలో మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా నారా చంద్రబాబునాయుడు మిగిలిన ప్రాంతాలకు తీరని…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో.. రాష్ట్రమంటే ఒక్క హైదరాబాదు మాత్రమే అన్నట్టుగా.. కేవలం ఆ ఒక్క నగరంలో మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా నారా చంద్రబాబునాయుడు మిగిలిన ప్రాంతాలకు తీరని ద్రోహం చేశారు. అలాంటి కేంద్రీకృత అభివృద్ధి ఫలితంగానే.. రాష్ట్ర విభజన డిమాండ్ పుట్టుకొచ్చింది. విభజన పట్ల వ్యతిరేకత పెల్లుబుకడానికి, విద్వేషాలు రగలడానికి కూడా అదే కారణం.

అప్పుడలా జనాల మధ్య విద్వేషాలకు బీజం వేసిన చంద్రబాబునాయుడు.. అమరావతి ఒక్కటే రాజధాని రూపంలో మళ్లీ అలాంటి విషప్రయోగానికి తెరతీశారు. కంప్యూటరు తెరమీద బొమ్మలు చూపించి.. దీనినొక అద్భుత రాజధానిగా చేస్తాం అంటూ రియల్ ఎస్టేట్ దందాను నడిపించారు. ఈ కేంద్రీకృత అభివృద్ధి అనేపాపాన్ని కడిగేసేందుకు జగన్ ప్రభుత్వం సంకల్పించింది. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికోసం మూడు రాజధానుల కాన్సెప్టును తెరపైకి తెచ్చింది.

ఈ ప్రతిపాదనను చంద్రబాబుగానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ గానీ తొలినుంచి వ్యతిరేకిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సంక్రాంతి సందర్భంగా అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్న వారి మాటలను గమనిస్తే.. చంద్రబాబుకు విశాఖ మరియు ఉత్తరాంధ్ర అంటేనే ద్వేషం ఉన్నదేమో, పగ ఉన్నదేమో అనే అనుమానం కలుగుతుంది.

జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని తోసిపుచ్చలేదు. దానిని లెజిస్లేటివ్ రాజధానిగా అభివృద్ధి చేస్తాం అన్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ, న్యాయరాజధానిగా కర్నూలు ఉంటాయన్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఏమంటున్నారంటే.. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటుందట. అయితే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారట.

నిజానికి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అనేది జగన్ చెబుతున్న ప్రతిపాదనే. జగన్ చెబుతున్న దానికీ చంద్రబాబు చెబుతున్న దానికీ ఒకటే తేడా ఉంది. జగన్ ప్రతిపాదనలో చీఫ్ జస్టిస్ ఉన్న హైకోర్టు కూడా కర్నూలులోనే ఉంటుంది. చంద్రబాబు చెబుతున్న దానిలో చీఫ్ జస్టిస్ లేని బెంచ్ ఉంటుంది. అంటే జగన్ ప్రతిపాదనను చంద్రబాబు కూడా ఫాలో అవుతున్నట్టే. రాయలసీమ తన తెలుగుదేశం పార్టీకి ఠికానా లేదు కాబట్టి.. దానిని వ్యతిరేకించడానికి చంద్రబాబుకు ధైర్యంలేదు. అదే సమయంలో.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే మాత్రం ఇష్టం లేదు.

చూడబోతే.. మొత్తం నాలుగు అర్బన్ సీట్లను తెలుగుదేశానికే కట్టబెట్టిన విశాఖ పట్ల, ఉత్తరాంధ్ర పట్ల చంద్రబాబులో ద్వేషం ఉన్నదని.. అందుకే కర్నూలుకు హైకోర్టుకు కూడా జై కొడుతున్నారు గానీ.. విశాఖ రాజధానిని మాత్రం వ్యతిరేకిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.