ఇంత చేసినా లావు ఇంకా మెత్తబడలేదా?

నరసరావుపేట ఎంపీ నియోజకవర్గం పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయాలలో ఏర్పడిన ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదా? ముఖ్యమంత్రి జగన్ సూచన మేరకు నియోజకవర్గం మారడానికి ఇష్టపడని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంకా అలకపాన్పు మీదనే ఉన్నారా?…

నరసరావుపేట ఎంపీ నియోజకవర్గం పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయాలలో ఏర్పడిన ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదా? ముఖ్యమంత్రి జగన్ సూచన మేరకు నియోజకవర్గం మారడానికి ఇష్టపడని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంకా అలకపాన్పు మీదనే ఉన్నారా? లావు గుంటూరు ఎంపీస్థానానికి మారాలనే ప్రతిపాదన విషయంలో జగన్ వెనక్కు తగ్గిన తర్వాత కూడా కృష్ణదేవరాయులు మెత్తబడలేదా? ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారా? అనే పుకార్లు స్థానికంగా వినిపిస్తున్నాయి.

నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును గుంటూరు ఎంపీస్థానానికి మారాల్సిందిగా కొన్ని రోజుల కిందట జగన్ సూచించిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకు ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. ఆనాటినుంచి.. ఇప్పటిదాకా నరసరావుపేట రాజకీయాల్లో రకరకాల నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సర్వేలు చెబుతున్న గణాంకాల ప్రకారం గుంటూరులో లావు పోటీచేస్తే గెలుస్తారని, నరసరావుపేట స్థానాన్ని బీసీ అభ్యర్థికి ఇవ్వాలని ఉందని జగన్ సూచించగా, ఆయన నిరాకరించారు. నరసరావుపేట వదలి వచ్చేది లేదని తేల్చేశారు.

ఈ ధిక్కారస్వరం  ఇలా ఉండగానే.. నరసరావుపేట ఎంపీ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు జగన్ ను కలిసి.. తమ ఎంపీగా లావును మాత్రమే కొనసాగించాలనే డిమాండ్ ను వినిపించారు.

సాధారణంగా అధినేత నిర్ణయానికి ఎదురు చెప్పే అలవాటు చాలా తక్కువగా ఉండే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.. తమ సొంత వ్యవహారం కాకుండా.. తమ ఎంపీ విషయంలో ఎమ్మెల్యేలు ఇలా జగన్ మనోగతానికి భిన్నంగా తమ వాదన వినిపించడం సంచలనమే అయింది. లావు కృష్ణదేవరాయలును అక్కడినుంచి మారిస్తే.. సామాజిక సమీకరణాల పరంగా తమ నియోజకవర్గంలో తాము గెలవడం కష్టం అవుతుందని ఆ ఎమ్మెల్యేలు జగన్ కు చెప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో జగన్ కూడా.. లావును మార్చాలనే నిర్ణయాన్ని నిలుపుదలచేశారు.

అక్కడితో వ్యవహారం సమసిపోలేదు. తనను మార్చదలచుకున్నందుకు లావు ఇంకా అలకలోనే ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తెలుగుదేశం నాయకులతో టచ్ లోకి వెళ్లారని, ఆ పార్టీ టికెట్ మీద పోటీచేయడానికి నిర్ణయించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఎంపీ తన కుటుంబంతో కలిసి సినిమా చూడడానికి వెళ్లినా కూడా.. ఐప్యాక్ ప్రతినిధులు వెంటాడుతున్నారని.. ఆయన కదలికల మీద నిఘా పెడుతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. లావు కృష్ణదేవరాయలును బుజ్జగించడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నించినా కూడా ఆయన అందుబాటులోకి రాలేదని కూడా అంటున్నారు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేశారని పేరున్న ఈ ఎంపీ విషయంలో జగన్ ఒక మెట్టు దిగి అయినా సరే.. వైసీపీ నుంచి బయటకు వెళ్లకుండా చూడాలని.. లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.