ఆయన ప్రస్తుతానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ దయతోనే జీవితంలో తొలిసారిగా ఎంపీ అనిపించుకున్నారు. ఉన్నది వైసీపీ అయినప్పటికీ.. చేస్తున్నది మాత్రం చంద్రభజన. నిరంతరం చంద్రబాబునాయుడును కీర్తిస్తూ, జగన్మోహన్ రెడ్డి పాలనను తూలనాడుతూ, చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలని ఉన్నదని కోరికను వ్యక్తం చేస్తూ ఉంటారు.
ఇంతకీ వచ్చే ఎన్నికల సమయానికి ఆయన చేయబోయేది మాత్రం.. భాజపాలో చేరడం! ఇంతకూ ఆయన ఎవరో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఆయనే రఘురామక్రిష్ణరాజు. నరసపురం నియోజకవర్గ ప్రజలు ఆయనను వైసీపీ అభ్యర్థిగా ఎంపీని చేసి పార్లమెంటుకు పంపిస్తే.. ఆయన కొన్నేళ్ల తర్వాత తన సొంత నియోజకవర్గానికి వచ్చారు.
తన సొంత నియోజకవర్గానికి తాను రాకుండా, తనను గెలిపించిన ప్రజలను కలవనివ్వకుండా ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం వేధించిందని కల్లబొల్లి కబుర్లు చెప్పే రఘురామక్రిష్ణ రాజు.. తన నానమ్మ చనిపోయినప్పుడు కూడా రాలేకపోయానని మొసలి కన్నీరు కార్చారు. ఇప్పుడు కూడా కోర్టు రక్షణతోనే నియోజకవర్గానికి రాగలిగానని ఆయన అంటున్నారు. మరోవైపు పోలీసులు చాలా బాగా సహకరించారని కూడా అంటున్నారు. ఈ మాటల్లోనే ఆయన కపటబుద్ధి, డొల్లతనం బయటపడుతున్నాయి.
అప్పటికీ ఇప్పటికీ ఆయన నియోజకవర్గంలో పోలీసులు మారలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారలేదు. ఇప్పుడు సహకరించిన పోలీసులు ఇదివరలో ఆయన ప్రజల చెంతకు వచ్చి ఉంటే మాత్రం ఎందుకు సహకరించిఉండరు అనేది అందరికీ ఎదురవుతున్న సందేహం. ఆయన ప్రతి అంశాన్నీ వైసీపీ మీద బురద చల్లడానికి వాడుకుంటున్నారనే విమర్శ ఉంది.
అదే సమయంలో, చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్ ను విపరీతంగా భజన చేస్తున్న రఘురామక్రిష్ణ రాజు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత బిజెపిలో చేరుతారనే ప్రచారం ఉంది. ఈ మేరకు బిజెపి పెద్దలతో మాట్లాడి ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా ప్రచారం ఉంది.
తెలుగుదేశంతో బిజెపికి కూడా పొత్తులు కుదరాలని కోరుకుంటున్న వారిలో ఆయన కూడా ఉన్నారు. బిజెపి కలిస్తే.. నరసాపురం సీటు పుచ్చుకుని కూటమి బలంతో గెలవాలని ఆయన ప్లాన్. పొత్తులు లేకపోయినా సరే.. బిజెపి తరఫునే పోటీచేస్తారనే వాదన ఉంది. చంద్రబాబును ధన బలంతో లోబరచుకుని లోపాయికారీ ఒప్పందంతో అక్కడ గెలవచ్చునని అనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ మళ్లీ గెలుస్తుందనే భయం రఘురామక్రిష్ణ రాజులో భయం ఉన్నదని, ఇన్నాళ్లపాటూ తనను గెలిపించిన పార్టీని దారుణంగా తిడుతూ వచ్చినందుకు తనను టార్గెట్ చేస్తారని భయపడుతూ.. బిజెపిలో చేరితో కాస్త సేఫ్ జోన్ లో ఉన్నట్టు అవుతుందని ఆయన భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.