విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసే సీటు సస్పెన్స్ అని అంటున్నారు. గంటా ప్రస్తుతం విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఉత్తరం నుంచి పోటీ చేయాలనుకోవడం లేదని సమాచారం.
గంటా గత నాలుగేళ్లుగా ఉత్తరం వైపు కన్నెత్తి చూడలేదని వైసీపీ ఇప్పటికే విమర్శలు ఎక్కుపెడుతోంది. పొత్తులో ఈ సీటు బీజేపీకి పోతుందని కూడా అంటున్నారు. గంటా అయితే భీమునిపట్నం మీద మనసు పెట్టారు. అక్కడ పొత్తులో జనసేనకు సీటు వెళ్తుందని భోగట్టా.
తాను పోటీ చేసే సీటు మీద గంటా పండుగ రోజు కూడా స్పష్టత ఇవ్వకపోగా సస్పెన్స్ లో పెట్టేశారు. తాను అధినాయకత్వం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తాను అని గంటా మీడియాకు చెబుతున్నారు. గంటాను విశాఖ నుంచి ఎంపీగా అధినాయకత్వం పోటీ చేయిస్తుంది అని ఒక ప్రచారం ఉంది. ఆయన మాత్రం అసెంబ్లీ నుంచే పోటీకి అని అంటున్నారు. పైగా భీమిలీ కోరుకుంటున్నారు.
అయితే ఆయన మీడియా ముందు మాట్లాడుతూ తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో తెలుసు అని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు అధినాయకత్వానికి ఆ సీటు సంగతి తెలుసు అంటున్నారు. దీనిని బట్టి పొత్తు సీటు గట్టి సీటే గంటా కోరుతున్నారు అని అంటున్నారు. ఇప్పటి నుంచే దాన్ని వెల్లడించకుండా సరైన టైం లో బయటపెడతారు అని అంటున్నారు.
గంటా మాత్రం సమయం వచ్చినపుడే తాను పోటీ చేసే సీటు విషయం వెల్లడిస్తాను అని ప్రకటించారు. గంటా పోటీ చేసే సీటు ఏది అయినా అధికార వైసీపీ ఆయన్ని టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉంది అని అంటున్నారు.