ఈసారి ఎలాగైనా తన కుమారుడిని ఎన్నికల్లో పోటీ చేయించాలని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గట్టి సంకల్పం తీసుకున్నారు. అందుకోసం ఆయన సీటు చూసుకుని కర్చీఫ్ కూడా వేసేశారు. ఆరు నూరు అయినా తన కుమారుడు 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అయ్యన్న అంటున్నారు.
అనకాపల్లి ఎంపీ సీటు కోసం తెలుగుదేశం పార్టీకి దరఖాస్తు చేసినట్లుగా అయ్యన్న పండుగ వేళ వెల్లడించారు. తన రాజకీయ వారసత్వాన్ని తన పెద్ద కుమారుడు విజయ్ పాత్రుడు కొనసాగిస్తారు అని అయ్యన్న చెబుతున్నారు.
తనకు రాజకీయ వారసుడు కొడుకే అని ఆయన అటు పార్టీ జనాలకు ఇటు అధినాయకత్వానికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చేశారు. తన కుమారుడికి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉందని అందుకే తాను ప్రోత్సహిస్తున్నాను అని అయ్యన్న అంటున్నారు.
అయ్యన్నపాత్రుడిని 2024 ఎన్నికల్లో నర్శీపట్నం నుంచి పోటీ చేయమని టీడీపీ అధినాయకత్వం కోరుతోంది. దానికి సరేనంటూనే తన కుమారుడికి కూడా ఎంపీ టికెట్ ఇవ్వాలని అయ్యన్న పట్టుబడుతున్నారు. టీడీపీ లోనే పుట్టి పెరిగి పునాదుల నుంచి ఆ పార్టీకి సేవ చేస్తున్న అయ్యన్నపాత్రుడు తన కుటుంబానికి రెండు టికెట్లు కోరుతున్నారు.
టీడీపీలో చాలా మంది సీనియర్ల కుటుంబాలకు రెండేసి టికెట్లు 2019తో పాటు అంతకు ముందు ఎన్నికల్లోనూ ఇచ్చిన అధినాయకత్వం అయ్యన్నపాత్రుడి విషయంలో మాత్రం ఒకే టికెట్ అనడం పైన ఆయన అనుచర వర్గం కూడా ఆవేదనకు గురి అవుతోంది. రెండు టికెట్లు అడుగుతున్నారు అంటే సత్తా ఉంటేనే అని కూడా అంటున్నారు. ఇపుడు అయ్యన్నపాత్రుడు ఓపెన్ అయిపోయారు. ఎంపీ టికెట్ కోరుతున్నామని బాహాటంగానే చెప్పేశారు. దాని మీద టీడీపీ హై కమాండ్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాల్సి ఉంది.