ప్రత్యర్థి పార్టీని నిలువునా రెండు ముక్కలుగా చీల్చేయడం తద్వారా తాము ప్రోత్సహించిన చీలికవర్గంతో కలిసి అధికారం పంచుకోవడం అనేది.. ఇటీవలి కాలంలో దేశంలో పలురాష్ట్రాల్లో ప్రబలంగా నడుస్తున్న వ్యవహారం. ఈ తరహా చీల్చు- పాలించు రాజకీయాలో భారతీయ జనతాపార్టీ ఆరితేరిపోయింది. అనేక రాష్ట్రాల్లో చీలికల ద్వారా అధికారంలో వారు భాగంగా ఉంటున్నారు.
అయితే వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే సమయానికి , మోడీ బలాన్ని కూడా చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తున్నదా? 2024 పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ మార్క్ ‘చీల్చు రాజకీయాలు’ తెరమీదికి రానున్నాయా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ మాటలు విన్న ఎవరికైనా సరే అలాగే అనిపిస్తుంది.
ఈ కేరళ ఎంపీ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ లోక్ సభలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. సభలో పెద్ద పార్టీగా ఉండగలదే తప్ప అధికారం ఏర్పాటు చేయడం మాత్రం సాధ్యం కాదని ఆయన మెలిక పెడుతున్నారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీకి సొంతంగా 400 సీట్లు సాధించడం అనేది టార్గెట్ గా వారు అడుగులు వేస్తుండగా.. బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చినా సరే.. ఎన్డీయే అధికారంలోకి రావడం కల్ల అని ఈ నాయకుడు జోస్యం చెప్పడమే విశేషం.
ఆయన అంచనా ప్రకారం.. ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీకి కూడా అధికారానికి సరిపడా సీట్లు రావట. ఏ కూటమికి కూడా అన్ని సీట్లు రావట. అయితే ప్రస్తుతం ఎన్డీయే లో భాగస్వాములుగా ఉన్న పార్టీలు ఆ కూటమిని వీడి ఇండియా కూడమికే మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నదని శశి థరూర్ అంటున్నారు.
ఆయన ఎలాంటి సమాచారంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో గానీ.. ఎన్డీయే కూటమి పార్టీలు ఎన్నికల తర్వాత.. బయటకు వచ్చి కాంగ్రెసుకు మద్దతివ్వడం జరిగితే అది చాలా పెద్ద పరిణామం అనుకోవాలి. అంటే ఎన్డీయే పార్టీలతో ఇప్పటినుంచే ఇండియా కూటమి పెద్దలు టచ్ లో ఉన్నారా? ఎన్నికల తర్వాత ఆ కూటమిని చీల్చడానికి ఇప్పటినుంచే వ్యూహరచనలో ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.