చంద్రబాబునాయుడుకు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. అందుకని ఎవరిని పణంగా పెట్టడానికైనా, ఎవ్వరిని బలిచేయడానికైనా ఆయన వెనకాడరు అనేది.. ఆయన గురించి లోతుగా ఎరిగిన అందరికీ తెలిసిన సంగతి. ప్రస్తుతం చివరిసారిగా ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్న చంద్రబాబునాయుడు.. కుటుంబాలను చీలుస్తున్నారు.
తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన విభజించి పాలించే దుర్నీతిని అవలంబిస్తుండడంతో.. ఉమ్మడి కుటుంబాలు కూడా ఛిద్రం అవుతున్నాయి. ఎంతో కాలంగా ఐక్యంగా ఉంటున్న అన్నదమ్ములు, ఉమ్మడి కుటుంబాలు కూడా చంద్రబాబు దెబ్బకు ఛిన్నాభిన్నం అవుతున్నాయని, కమ్మ కులానికి చెందిన కుటుంబాలనుకూడా ఆయన విచ్ఛిన్నం చేస్తున్నారని ఆ వర్గానికి చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో- చంద్రబాబునాయుడు రాజకీయ స్వార్థానికి బలైన తొలికుటుంబం కేశినేని వారే అని చెప్పుకోవాలి. విజయవాడ ఎంపీ కేశినేని నానిని దాదాపుగా పార్టీనుంచి వెలివేసిన చంద్రబాబు, అదే సమయంలో ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని మాత్రం చాలా తెలివిగా మభ్యపెట్టారు. చంద్రబాబు పెట్టిన మానసిక టార్చర్, చేసిన అవమానాలు భరించలేక కేశినేని నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు వెళ్లిన తర్వాత.. ఆయన తమ్ముడు చిన్ని తెరపైకి వచ్చారు. మా కుటుంబంలో ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి అంటూ కొత్త పాట ఎత్తుకున్నారు.
తాజాగా రాయపాటి వారి ఉమ్మడి కుటుంబంలోనూ చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చిచ్చు పెట్టాయి. సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఆదాయవనరుగా కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబునాయుడు తన ఏలుబడి సాగిన కాలంలో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులు అప్పగించే రూపంలో అనేక అడ్డదారులు తొక్కారనే ఆరోపణలున్నాయి.
అయితే రాజకీయంగా రాయపాటి అభ్యంతరాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా, వారి శత్రువు కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. పైగా రాయపాటి సాంబశివరావు కొడుకు రంగారావు ఆశిస్తున్న సత్తెనపల్లి సీటును కన్నాకు ప్రకటించేశారు. ఇది వారికి కడుపు మండించింది. చంద్రబాబు, లోకేష్ అవకాశవాదం గురించి రంగారావు తీవ్రమైన విమర్శలు చేసి పార్టీనుంచి బయటకు వెళ్లిపోయారు.
చంద్రబాబు వెంటనే తన విభజించి పాలించే అస్త్రాన్ని బయటకు తీశారు. ఈసారి, రాయపాటి సాంబశివరావు తమ్ముడు శ్రీనివాస్ ను మభ్యపెట్టారు. తాము ఎప్పటికీ తెలుగుదేశంతోనే ఉంటామని, తమ ఉమ్మడి కుటుంబంలో ఇటీవలి కాలంలోనే విభేదాలు వచ్చాయని, రంగారావు మాటలను ఖండిస్తున్నామని శ్రీనివాస్ తో ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటింపజేశారు. చంద్రబాబు రాజకీయాలకు మరో కమ్మ కుటుంబం విచ్ఛిన్నం అయిందని ఆ వర్గం వారే విమర్శిస్తున్నారు.