పండుగ నాడూ పాత మొగుడేనా అనే సామెతను తమ నాయకుడు పవన్‌కల్యాణ్ గుర్తు చేస్తున్నారని జనసేన నాయకులు వాపోతున్నారు. సామాజికంగా పాజిటివ్ సంకేతాలు పంపడంలో పవన్‌కు కనీస స్పృహ లేకపోవడంపై సొంత పార్టీ నాయకులు వాపోతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఎడిటర్, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి వెల్లడించడం విశేషం.
అమరావతిలో నిర్వహించిన భోగి వేడుకలో చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ కలిసి పాల్గొన్నారు. అయితే చంద్రబాబు పక్కన దళిత నాయకుడంటే, ఇదే పవన్ పక్కన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ ఉన్నారని, పండుగ నాడైనా అతన్ని పక్కన పెట్టొచ్చు కదా? అని జనసేన నేతల ఆవేదనగా తెలకపల్లి రవి పేర్కొన్నారు.
తనకు జనసేనకు చెందిన ముఖ్య నాయకుడు ఫోన్ చేసి తన ఆవేదన వెల్లడించినట్టు రవి విశ్లేషించారు. రవి విశ్లేషణలోని రాజకీయ సారాంశం ఏంటో తెలుసుకుందాం.
మా పవన్‌కల్యాణ్ ఇంత అమాయకుడు ఏంటండి? అని తనకు ఫోన్ చేసిన జనసేన నాయకుడు ప్రశ్నించినట్టు రవి తెలిపారు. పవన్ అమాయకుడని జనసేన నాయకుడైన మీరే అంటున్నారేంటని తాను ప్రశ్నించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇందుకు ఆ జనసేన నాయకుడు స్పందిస్తూ…
“న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనిపించాలని అంటారని… లోపల ఉన్నా, లేకపోయినా పైకి చూపించడం ఒక కళ కదా? చంద్రబాబునాయుడు తన పక్కన ఒక దళిత నాయకుడిని కూచోపెట్టుకున్నారు. ఈ రోజు అమరావతిలో తన పక్కన దళిత నేతను కూచోపెట్టుకోవడం ద్వారా పంపదలుచుకున్న సంకేతం …దళితుల కోసం నిలబడతానని చెప్పేందుకు. ఇదే పవన్‌కల్యాణ్‌ను చూడండి… దళితులు, బీసీల గురించి ఆలోచిస్తుంటారు. కానీ తన పక్కన నాదెండ్ల మనోహర్‌నే కూచోపెట్టుకున్నారు. ఈ ఒక్క రోజైనా ఒక దళితున్ని కూచోపెట్టుకుంటే ఎంత బాగుంటుంది? ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? పవన్ అమాయకత్వం ఇది” అని సదరు జనసేన నాయకుడు తనతో వాపోయినట్టు రవి తెలిపారు.
పవన్‌కల్యాణ్ దళితులు, బీసీల వైపు ఉన్నారనే సోషల్ మెసేజ్ పంపడం కోసమే జనసేన నాయకుడి ఆవేదనగా కనిపించిందని తెలకపల్లి రవి తెలిపారు. కనీసం నాదెండ్ల మనోహరైనా పండుగ పూట పవన్‌కు దూరంగా వుండి వుంటే బాగుండేదని జనసేన నాయకుడి ఆవేదన చూశాక అర్థమైందనే చర్చకు తెరలేచింది. నిత్యం నాదెండ్ల మనోహర్‌ను వెంటపెట్టుకుని వుండడం వల్ల మిగిలిన సామాజిక వర్గాల్లో జనసేనపై వ్యతిరేకత ఏర్పడుతుందనే భయం ఆ పార్టీ కార్యకర్తలు, నేతల్లో కనిపిస్తోంది.