సంక్రాంతి బరిలో నిలిచిన సైంధవ్ సినిమాకు కూడా మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా రాలేదు. నిన్న రిలీజైన సైంధవ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అటుఇటుగా 6.5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది.
వెంకీ కెరీర్ లో 75వ చిత్రంగా తెరకెక్కింది సైంధవ్. ఈ సినిమాకు కాస్త గట్టిగానే ప్రచారం చేశారు, స్వయంగా వెంకటేశ్ రంగంలోకి దిగి ప్రచారం చేశారు. కానీ ఎందుకో సినిమాపై అనుకున్న స్థాయిలో బజ్ రాలేదు. దీనికంటే ముందు గుంటూరుకారం లాంటి భారీ సినిమా ఉండడం వల్ల అందరి చూపు మహేష్ సినిమాపైనే నిలిచింది. దీనికితోడు స్క్రీన్ కౌంట్ తక్కువగా ఉండడం, టికెట్ రేట్లు పెంచకపోవడం సైంధవ్ ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించాయి.
ఈ సంగతి పక్కనపెడితే, ఇప్పుడీ సినిమా బ్రేక్ ఈవెన్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రేడ్ అంచనా ప్రకారం, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 22 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాలంట. ప్రస్తుతం నడుస్తున్న టాక్ తో ఈ స్థాయిలో వసూళ్లు అంటే కష్టమే.
గట్టిగా మరో 3 రోజులు మాత్రమే సంక్రాంతి సీజన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకో వీకెండ్ వస్తుంది. సైంధవ్ కోలుకోవాలంటే, రాబోయే రోజులు చాలా కీలకం.