అంబటి మాస్ డాన్స్.. ఈసారి ఇంకాస్త స్పెషల్

రాంబాబు వెర్సెస్ శ్యాంబాబు ఎపిసోడ్స్ గురించి అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో అంబటి రాంబాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సంక్రాంతి సంబరాల్లో ఆయన వేసిన డాన్సుల్ని అనుకరిస్తూ, 30…

రాంబాబు వెర్సెస్ శ్యాంబాబు ఎపిసోడ్స్ గురించి అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో అంబటి రాంబాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సంక్రాంతి సంబరాల్లో ఆయన వేసిన డాన్సుల్ని అనుకరిస్తూ, 30 ఇయర్స్ పృధ్వీతో బ్రో సినిమాలో ప్యారడీ చేయించారు. పనిలోపనిగా శ్యాంబాబు పాత్రను అడ్డంపెట్టుకొని పవన్ తో కొన్ని డైలాగ్స్ కూడా చెప్పించారు.

ఆ వివాదం ముగిసిపోయింది. అయితే అంబటి రాంబాబు డాన్స్ మళ్లీ తెరపైకి వచ్చింది. భోగి పండగ సందర్భంగా ఎప్పట్లానే అంబటి మరోసారి స్టెప్పులేశారు. గత వివాదం దృష్ట్యా ఈసారి ఆయన డాన్స్ కు మరింత పాపులారిటీ పెరిగింది.

గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈసారి ఆయన ఇంకాస్త ఎక్కువ స్టెప్పులేశారు. హీరోల రేంజ్ లో రెండు చేతులు గాల్లో ఊపుతూ, కాస్త పక్కకు వంగి పోజులిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన అంబటి.. గతంలో తనపై చేసిన పేరడీపై మరోసారి స్పందించారు.

“అవును.. నేను సంబరాల రాంబాబునే. అందులో అనుమానం ఏముంది. సంక్రాంతికి నేను సంబరాల రాంబాబునే. సంక్రాంతి దాటితే పొలిటికల్ రాంబాబుని. ఈ వ్యత్యాసం గమనించలేని పిచ్చి రాజకీయ నాయకులు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరికొందరు నా క్యారెక్టర్ ను సినిమాల్లో పెట్టి కించపరచాలని చూశారు. కించపరిస్తే కిందపడేవాడ్ని కాదు నేను.”

డాన్స్ అయినా, రాజకీయ ప్రసంగమైనా తను ముందుగా ప్రిపేర్ అవ్వనంటున్నారు అంబటి. ఆ టైమ్ కు ఆసువుగా రెండూ వస్తాయని చెబుతున్నారు. మొత్తమ్మీద బ్రో సినిమాలో శ్యాంబాబు ఎపిసోడ్ తో, ఈసారి రాంబాబు డాన్స్ కు మంచి క్రేజ్ వచ్చింది.